ఆ విశేష పర్వదినం కోసం ముస్తాబు అవుతున్న తిరుమల
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం నాడు 90,011 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 33,328 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.23 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. నారాయణగిరి షెడ్ల వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

ఈ నెల శ్రీవారకి మరోసారి గరుడ వాహనసేవను నిర్వహించబోతోంది టీటీడీ. ఈ నెల 29వ తేదీన గరుడ పంచమి. ఈ పండగను పురస్కరించుకుని.. మరోసారి మలయప్ప స్వామివారు గరుడ వాహనారూఢుడై తిరుమాడ వీధులలో ఊరేగుతాడు. అశేష భక్తజనులను కరుణిస్తాడు. ఈ విశేష ఉత్సవాన్ని తిలకించడానికి భారీ సంఖ్యలో భక్తులకు తిరుమలకు వచ్చే అవకాశం ఉంది.
దీంతో ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి గరుడ సేవను నిర్వహించినట్టవుతుంది. ఇది అరుదైన ఘట్టం. వ్యాస పౌర్ణమి/గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఈ నెల 10వ తేదీన తిరుమలలో గరుడ వాహన సేవ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.
వీటితో పాటు ఈ నెల 25వ తేదీన చక్రతాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, 28న శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు, 30న కల్కి జయంతి, కశ్యప మహర్షి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు. దీంతో ఈ నెలలో స్వామివారికి నిర్వహించిన పర్వదినాలు, విశేష ఉత్సవాలు ముగిసినట్టవుతుంది.
అటు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ నెల 19వ తేదీ ఈ ఉత్సవం ఆరంభమైంది. 28వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా ఉత్సవ రోజుల్లో శ్రీ ఆండాళ్ అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు.
జూలై 28న శ్రీ ఆండాళ్ అమ్మవారి శాత్తుమొర సందర్భంగా ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారిని అలిపిరికి ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ ఆస్థానం నిర్వహిస్తారు.
ప్రత్యేక పూజల అనంతరం అలిపిరి నుండి రామనగర్ క్వార్టర్స లోని గీతా మందిరం, ఆర్‌ఎస్ మాడ వీధి లోని శ్రీ విఖనసాచార్యుల ఆలయం, శ్రీ చిన్నజీయర్ మఠం మీదుగా ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. రాత్రి 8 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారి సన్నిధిలో శాత్తుమొర నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications