లడ్డూ తయారీలో నెయ్యి ఇబ్బందులు- టీటీడీ క్లారిటీ..!!
Tirumala: తిరుమలలో లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యి సకాలంలో అందటం లేదు. శ్రీవారి లడ్డూ ప్రసాదం వినియోగం కోసం నెయ్యి వినియోగం టీటీడీకి కొంత ఇబ్బందిగా మారుతోంది. తిరుమలలో వినియోగించే నెయ్యి నాణ్యతను పరిశీలించిన తరువాతనే వినియోగానికి అనుమతి ఇస్తున్నారు. అయితే, ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన నూతన పరికరాలతో పరీక్షకు ఎక్కువ సమయం పడుతుండటంతో, ప్రసాదాల తయారీకి సకాలంలో నెయ్యి అందించలేకపోతున్నట్లు తెలుస్తోంది.
దీని పైన టీటీడీ అధికారులు స్పష్టత ఇచ్చారు.
నెయ్యి వినియోగం
తిరుమలలో నెయ్యి వినియోగం.. నాణ్యత పరీక్షల విషయంలో కొన్ని ఇబ్బందులు టీటీడీ ఎదుర్కో వాల్సి వస్తోంది. తిరుమలలో ఏర్పాటు చేసిన ల్యాబ్ లో నూతన పరికరాలతో నెయ్యి పరీక్షలు జరుగుతున్నాయి. శ్రీవారి అన్నప్రసాదాలతో పాటు లడ్డూప్రసాదాల తయారీ కోసం టీటీడీ ప్రతీ రోజూ 12 వేల నుంచి 14 వేల కేజీల నెయ్యిని వినియోగించాల్సి ఉంటుంది. గతంలో తిరుమల లోని ల్యాబ్‌లో నెయ్యి నాణ్యతను పూర్తిస్థాయిలో పరీక్షించేందుకు సరైన పరికరాలు లేకపోవడంతో కల్తీ జరిగిందనే ప్రచారం పెద్ద ఎత్తున కలకలం రేపింది. దీంతో, తామే నెయ్యి నాణ్యతను వంద శాతం పరీక్షించే పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని టీటీడీ నిర్ణయించింది.

సొంత ల్యాబ్ లో పరీక్షలు
ఈ నిర్ణయానికి అనుగుణంగా దాదాపు రూ.70 లక్షల విలువైన గ్యాస్ క్రోమాటోగ్రాఫ్ (జీఎస్), హై ఫెర్ఫార్మన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రాఫ్ (హెచ్‌పీఎల్‌సీ)అనే రెండు పరికరాలను నేషనల్ డైయిరీ డెవల్‌పమెంట్ బోర్డు విరాళంగా అందించింది. వీటిని ఇటీవల తిరుమలలోని ల్యాబ్‌లో ఏర్పాటు చేసి పరీక్షలు చేయడం మొదలుపెట్టారు. అయితే టెండర్ సరఫరాదారుల నుంచి నెయ్యి సకాలంలో తిరుమలకు చేరుతున్నప్పటికీ పరీక్షించే సమయం అధికంగా పడుతున్న క్రమంలో ప్రసాదాల తయారీకి సకాలంలో నెయ్యి చేరడం లేదని తెలుస్తోంది. నూతన పరికరాలు కావడంతో సూక్ష్మస్థాయిలో పరీక్షించేందుకు అధిక సమయం పడుతున్నట్టు చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఈ సమస్య ఏర్పడిందని.. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదని టీటీడీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇబ్బంది లేదు
ప్రస్తుతం టీటీడీ వద్ద దాదాపు 23 వేల కేజీల నెయ్యి సిద్ధంగా ఉందని టీటీడీ అధికారులు స్పష్టం చేసారు. ఎప్పటిలానే రోజుకు 3.5 లక్షల లడ్డూలను, అన్నప్రసాదాలను దిట్టం ప్రకారం తయారు చేస్తున్నామని వివరించారు. నెయ్యి వివాదం పైన సుప్రీం ఆదేశాలతో ఏర్పాటైన సిట్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసారు. ఈ సమయంలోనే కల్తీ నెయ్యి కేసు విచారణను నెల్లూరు ఏసీబీ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలంటూ సిట్ అధికారులు తిరుపతి 2వ ఏడీఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సిట్ తరపున, అలాగే నిందితుల తరఫు వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు.












Click it and Unblock the Notifications