TTD: శ్రీవారికి 15 బంగారు పతకాల విరాళం - బ్రహ్మోత్సవాల వేళ కీలక అప్డేట్..!!
Tirumala: తిరుమలలో బ్రహ్మోత్సవాల వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవ వేళ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. ఆ రోజున భారీ ఏర్పాట్లు చేసింది. తాజాగా శ్రీవారికి 15 బంగారు పతకాలు.. రెండు వెండి తట్టలు విరాళం గా అందించారు.
శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం మఠాధిపతి శ్రీమద్ విద్యాదీశ తీర్థ స్వామీజీ రూ.1.80 కోట్లు విలువైన 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలను శ్రీవారికి సోమవారం నాడు తిరుమలలో బహుకరించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పేష్కార్ శ్రీ రామకృష్ణ కు స్వామీజీ కానుకలు అందజేశారు. ఇక, అటు సెప్టెంబర్ 23 మంగళవారం, బ్రహ్మోత్సవాలకు నాందీ సూత్రంగా అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటే కార్యక్రమం జరుగుతుంది. వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యత ఉంది.

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతినిత్యం జరిగే సేవలను నిత్యోత్సవాలు, వారంలో ఒకరోజు జరిగే ఉత్సవాలను వారోత్సవాలు అంటారు. అలాగే మాసోత్సవాలు, వార్షికోత్సవాలు నిర్వహిస్తుంటారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వాహనసేవల వేళలను టీటీడీ ప్రకటించింది. ఈ నెల 24వ తేదీన ఉదయం ధ్వజారోహనం, సాయంత్రం పెద్దశేష వాహనం సేవ ఉంటుంది. అదే విధంగా 25న ఉదయం చిన్నశేష, సాయంత్రం హంసవాహనం సేవ ఉంటాయి.
26వ తేదీన ఉదయం సింహ, సాయంత్రం ముత్యపు పందిరి సేవ ఉంటాయి. 27వ తేదీన ఉదయం కల్ప వృక్ష, సాయంత్రం స్వల్పభూపాల సేవ నిర్వహించనున్నారు. 28న ఉదయం మోహిని అవతారం, సాయంత్రం గరుడవాహన సేవ ఉంటుంది. ఈ సేవ తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఇందుకోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది.
ఇక, 29వ తేదీన ఉదయం హనుమంత వాహన సేవ, సాయంత్రం స్వర్ణరథోత్సవం ఉంటుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. 30వ తేదీన ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం వేళ చంద్రప్రభ వాహనం పైన స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. అక్టోబర్ 1వ తేదీన రథోత్సవం, సాయంత్రం అశ్వవాహనం పైన స్వామి వారు అనుగ్రహిస్తారు. ఇక.. అక్టోబర్ 2వ తేదీన ఉదయం చక్రస్నానం,సాయంత్రం గజావరోహనం ఉంటుంది.












Click it and Unblock the Notifications