మంచి రోజులు: మురళీ మోహన్, బాబుపై వంగవీటి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు మంచి రోజులు వచ్చాయని ప్రముఖ నటుడు, రాజమండ్రి నుండి ఎంపీగా గెలిచిన మురళీ మోహన్ ఆదివారం అన్నారు. సీమాంధ్రలో టిడిపి, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం రావడం చాలా సంతోషకరమన్నారు. ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారని, కేంద్ర, రాష్ట్రాల్లో మంచి ప్రభుత్వాలు రావడానికి అవకాశం ఇచ్చారన్నారు. సీమాంధ్రను అభివృద్ధి చేసుకోవడానికి అందరం కలిసి కృషి చేద్దామన్నారు. మురళీ మోహన్ అధినేత చంద్రబాబును కలిశారు.
దళితులను ఎవరు పట్టించుకోలేదు: కొప్పుల ఈశ్వర్
రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు దళితులను పట్టించుకోలేదని తెలంగాణరాష్ట్ర సమితి నేత కొప్పుల ఈశ్వర్ ఆదివారం అన్నారు. దళితులకు అన్ని విధాలుగా న్యాయం చేస్తానని తెరాస హామీ ఇచ్చిందని చెప్పారు. మందకృష్ణ మాదిగ దళితులను తలో దిక్కుగా మార్చారని మండిపడ్డారు. తాము ఇచ్చిన వాగ్ధానాలను తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు.

బాబు తప్పుడు వాగ్ధానాలు: వంగవీటి
ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తామని విజయవాడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ అన్నారు. చంద్రబాబు ఇచ్చిన తప్పుడు వాగ్దానాల వల్లే తాము ఓడిపోయామన్నారు. చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ప్రతిపక్ష పాత్రలో ఉండి ప్రజాసమస్యలపై పోరాడుతామన్నారు.
సంప్రదాయం ప్రకారమే: ఈటెల
మెజార్టీ సాధించిన పార్టీగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను సంప్రదాయం ప్రకారమే కలిసామని ఈటెల రాజేందర్ అన్నారు. గవర్నర్‌తో భేటీ ముగిసిన అనంతరం ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కెసిఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు. ఇదే విషయాన్ని గవర్నర్‌కు తెలిపామని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని ఈటెల తెలిపారు. తెరాస పార్టీతోనే తెలంగాణ పునర్‌నిర్మాణం సాధ్యమని ప్రజలు తీర్పు నిచ్చారని, ప్రజల ఆకాంక్ష నెరవేర్చే క్రమంలో ఎమ్మెల్యేలందరం కెసిఆర్‌ను ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు.
నాదే బాధ్యత: జెపి
పార్టీ ఓటమికి తనదే బాధ్యత అని లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ వేరుగా అన్నారు. ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తున్నామని చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం వచ్చిందన్నారు. చంద్రబాబు, మోడీ, కేసఆర్‌లకు జెపి అభినందనలు తెలిపారు. అందరు దేశ అభివృద్ధికి పాటుపడాలన్నారు.












Click it and Unblock the Notifications