ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త వినిపించింది. పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీరికి ప్రభుత్వం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. దీనికోసం ప్రత్యేకంగా ఒకరోజు సాధారణ సెలవు మంజూరు చేశారు. ఈమేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీచేశారు.
ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు ఓటు వేయవచ్చు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల అభ్యర్థన మేరకు సంబంధిత అధికారులు ఒకరోజు ప్రత్యేక క్యాజువల్ సెలవును మంజూరు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు సెలవు ప్రకటించారు. ఉత్తర్వులకు తగినట్లుగా వివిధ విభాగాల అధిపతరులు, జిల్లా కలెక్టర్లు, సెక్రటేరియట్ విభాగాలవారు తగిన చర్యలు తీసుకోవాలని సీఈవో సూచించారు.

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఏ ఉద్యోగీ తన ఓటు హక్కును కోల్పోకూడదని, విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికీ¨ పోస్టల్ బ్యాలట్ ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపైనే ఉంది. ఇదే విషయాన్ని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, దామోదరరావు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల విధులకు నియోజకవర్గాల వారీగా ఎంతమంది సిబ్బందిని కేటాయించారో స్పష్టమైన సమాచారం లేదన్నారు. ఏప్రిల్ 30న ఎన్నికల విధుల్లోకి తీసుకున్న అంగన్‌వాడీ, కాంట్రాక్టు ఉద్యోగులకు పోస్టల్ బ్యాలట్ అందేలా ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే గడువు పెంచాలని ఈసీని ఉద్యోగ సంఘ నేతలు కోరుతున్నారు.
దాదాపు 3 వేల మందికి పైగా సర్వీసు ఓటర్ల కోసం పోస్టల్ బ్యాలెట్ ప్రవేశపెడుతున్నారు. వీరికి ఆన్‌లైన్ ద్వారా బ్యాలెట్ పత్రాలు పంపుతారు. వీరి కోసం రెండు బ్యాలెట్ పత్రాలు సిద్ధమయ్యాయి. లోక్ సభకు ఒకటి, అసెంబ్లీకి మరొకటి ఉంటుంది. ఆన్ లైన్ లో వీటిని డౌన్ లోడ్ చేసుకొని ఓటు హక్కు వినియోగించుకొని వీటిని జాగ్రత్తగా ప్రత్యేక కవరులో పోస్ట్ బాక్స్ లో వేయాలి. అవి రిటర్నింగ్ అధికారికి చేరతాయి.












Click it and Unblock the Notifications