ఏపీలో 10వ తరగతి విద్యార్ధులకు ప్రభుత్వం తీపి కబురు..
ఏపీలో రేపటి (మార్చి 17) నుంచి పడవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్ధులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు ప్రకటించింది. పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సదుపాయం కల్పించినట్టు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
స్టూడెంట్స్ సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఉచిత ప్రయాణ సదుపాయం ఏర్పాటు చేసినట్టు మంత్రి వెల్లడించారు. విద్యార్థులు నిర్ణీత సమయం కంటే ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చే దిశగా.. విద్యార్ధులు అడుగులు వేస్తూ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని కోరారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సులో ఉచితంగా వెళ్లొచ్చని స్పష్టం చేశారు.

ఏపీ వ్యాప్తంగా మొత్తం 6,49,275 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. తెలుగు మాధ్యమంలో 51,069 మంది.. ఆంగ్ల మాధ్యమంలో 5,64,064 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎండల తీవ్రత పెరిగిపోవడంతో పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
మరోవైపు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు పలు కీలక సూచనలు చేశారు. విద్యార్థులకు మంత్రి ఆల్ ది బెస్ట్ చెప్పారు. విద్యార్థులందరూ చక్కగా పరీక్షలు రాయాలని, మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ఎటువంటి ఒత్తిడికి లోనుకావొద్దని.. హాల్‌టికెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలన్నారు.












Click it and Unblock the Notifications