ఏపీలో కరెంటు బిల్లుల షాక్... గ్రూప్ టారిఫ్ ఫలితం- ఏప్రిల్ రీడింగ్ తీయకపోవడం వల్లే ?
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా గత నెలలో ఏపీలో కరెంటు బిల్లులు తీయకపోవడం వినియోగదారులకు చుక్కలు చూపించేలా కనిపిస్తోంది. గత నెలలో రీడింగ్ తీయకుండా మౌనంగా ఉన్న ఏజెన్సీలు.. రెండు నెలల రీడింగ్ ఒకేసారి కలిపి తీయడం వల్ల స్లాబ్ లు మారిపోతున్నాయి. దీంతో గరిష్ట స్లాబ్ ల ఆధారంగా తాజా బిల్లులు జారీ చేస్తున్నారు. వీటిని చూసిన వినియోగదారులకు షాక్ తప్పడం లేదు.

ఏపీలో విద్యుత్ బిల్లుల షాక్...
ఏపీలో గత నెలలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావంతో విద్యుత్ బిల్లులు తీయలేదు. వీలున్న చోట్ల మార్చినెల బిల్లులనే చెల్లించమని విద్యుత్ పంపిణీ సంస్ధలు వినియోగదారులను కోరాయి. దీంతో ఆన్ లైన్లో చెల్లించే అవకాశం ఉన్నవారు బిల్లులు కట్టేశారు. వీరు కాకుండా సాధారణ జనం మాత్రం మార్చి, ఏప్రిల్ నెలల బిల్లులు కట్టలేదు.. వీరి విషయంలో విద్యుత్ సంస్ధలు అనుసరిస్తున్న విధానం కలకలం రేపుతోంది. తాజాగా విద్యుత్ శాఖ తీసుకున్న నిర్ణయం ప్రకారం గత రెండు నెలల విద్యుత్ వినియోగాన్ని కలిపి బిల్లులను తయారు చేసి పంపుతున్నారు. దీంతో ఈ మొత్తం బిల్లు భారీగా ఉంటోందని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.

స్లాబ్ ల మార్పుతో పెరిగిన బిల్లులు..
విద్యుత్ మీటర్ నుంచి నెల నెలా వాడకం బిల్లు తీసినప్పుడు వివిధ స్లాబ్ ల ఆధారంగా వాటికి నిర్ణయించిన రేట్ల ఆధారంగా బిల్లు తయారవుతుంది. అంటే ఉదాహరణకు 0 నుంచి 50 మీటర్లు వాటినప్పుడు వాటికి ఓ రేటు, అలాగే 51 నుంచి 100 మీటర్లు వాడే వారికి మరో రేటు ఉంటుంది. ఈ రేటు మీటర్లు పెరిగే కొద్దీ పెరుగుతూ పోతుంటుంది. ఒక నెలలో చూసినప్పుడు 50 మీటర్ల లోపు వాడినవారికి వచ్చే బిల్లు కనీసంగా ఉంటుంది. కానీ అదే రెండు నెలలు కలిపి లెక్కించాల్సి వస్తే అప్పుడు 100 మీటర్ల స్లాబ్ లోకి వెళ్లిపోతుంది. అంటే బిల్లులను కలిపి లెక్కించడం వల్ల వినియోగదారులకు భారీ నష్టం తప్పదు..

వేసవితో పెరిగిన వినియోగం...
మార్చి నెల నుంచే వేసవి ప్రారంభం కాగానే జనం ఇళ్లలో ఫ్యాన్ లు, కూలర్లు, ఏసీలు వాడకం మొదలుపెట్టేశారు. అదే సమయంలో కరోనా లాక్ డౌన్ కూడా ప్రారంభమైంది. దీంతో బిల్లులు తీసేందుకు వీలు కాలేదు. అంటే మార్చి నెల నుంచి ఇప్పుడు మే నెల వరకూ సాధారణ వినియోగం కంటే ఎక్కువగానే నమోదవుతోంది. దీనికి తోడు బిల్లులు కలిపి లెక్కించడం వల్లే స్లాబ్ లు మారి భారీగా బిల్లులు నమోదవుతున్నాయి. వీటిని అందుకున్న కస్టమర్లు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. రెండు బిల్లులు కలిపి ఎలా లెక్కిస్తారని విద్యుత్ అధికారులను ప్రశ్నిస్తున్నారు.
Recommended Video

ఏప్రిల్ లో చెల్లించిన వారికీ మోతే...
ఏప్రిల్ లో లాక్ డౌన్ కొనసాగిస్తున్న పరిస్ధితుల్లో ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్ధలు... మార్చి నెల బిల్లునే కట్టేస్తే సరిపోతుందని వినియోగదారులకు స్పష్టం చేశాయి. దీంతో వీరంతా వాడకంతో సంబంధం లేకుండా మార్చి నెల బిల్లునే చెల్లించారు. వీరికి ఇప్పుడు దాన్ని మినహాయించి మిగిలిన మొత్తం చెల్లించాలని నోటీసులు, బిల్లులు పంపుతున్నారు. దీంతో ఏప్రిల్ నెల బిల్లు చెల్లించినా మాకీ దుస్దితి ఏంటని వారు నిలదీస్తున్నారు. కనీసం ఏప్రిల్ బిల్లులు చెల్లించిన వారిని అయినా ఈ గ్రూప్ టారిఫ్ నుంచి మినహాయించాలని వీరు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం దీనిపై ఇప్పటికే తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications