భారీ వర్షాలు: నెల్లూరు జిల్లాలో 20 మంది మృతి, శవానికీ తప్పని తిప్పలు
నెల్లూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ కారణంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు 20 మంది మృతి చెందారు. 500 చెరువులకు గండ్లు పడ్డాయి. పదివేల ఎకరాల్లో చేపలు, రొయ్యల చెరువులకు భారీ నష్టం వాటిల్లినట్లు అంచనా.
తీరంలో అలల ఉధృతికి పడవలు, వలలు కొట్టుకుపోయాయి. జాతీయరహదారికి పలుచోట్ల గండ్లు పడ్డాయి. దీంతో పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మరో 24 గంటల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

ఇదిలావుంటే, నెల్లూరు జిల్లా వెంకటగిరి, వెంకటాచలం, గూడూరు, మనుబోలు మండలాల్లో 150 గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలో ఉన్నాయి. వరద పీడిత ప్రాంతాల ప్రజలకు సాయం చేసేందుకు రెండు హెలికాప్టర్లను ఎనడీఆర్‌ఎఫ్ సిద్ధం చేసింది. వాతావరణం అనుకూలించక పోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
నెల్లూరు జిల్లా కొడవలూరులో మాణికల రమణయ్య (60) అనే వ్యక్తి మంగళవారం మరణించాడు. భారీ వర్షాలతో శ్మశానం చెరువును తలపిస్తుండటంతో మృతదేహాన్ని పూడ్చేందుకు వీలుకాలేదు. దీంతో కుటుంబసభ్యులు మృతదేహాన్ని పైడేరులో వదిలేశారు. అక్కడే అంతిమ సంస్కారాలు పూర్తి చేసి వెనక్కి వచ్చేశారు.

భారీ వర్షాలకు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి తమిళనాడులో గల్లంతయ్యారు. నెల్లూరులో చలిగాలుల తాకిడికి 8 మంది మృతి చెందగా గోడ కూలి మరో చిన్నారి మరణించింది. కడప జిల్లాలో వరదల్లో కొట్టుకుపోయి, గోడలు కూలి, ఇళ్లు కూలి, చలి గాలుల కారణంగా 9 మంది మృతి చెందారు. వీరిలో ఆరుగురు చిన్నారులున్నారు. అనంతపురంలో వర్షాల కారణంగా కదిరి గ్రామీణ మండలంలోని కాల సముద్రం వంతెన కూలి ఓ గర్భిణి మృతి చెందింది.












Click it and Unblock the Notifications