డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా?: ఉచితాలపై వెంకయ్య నాయుడు
Venkaiah Naidu: పోలింగ్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో- రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతంగా కొనసాగుతోంది. అన్ని పార్టీలు తమ ప్రచార కార్యక్రమాల తీవ్రతను పెంచాయి. అదే సమయంలో నామినేషన్ల పర్వం కూడా జోరెత్తింది. మూడొంతులకు పైగా అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
ఈ పరిస్థితుల్లో మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు తెరపైకి వచ్చారు. న్యూఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. తాజాగా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలక పాత్ర పోషించడానికి వెంకయ్య నాయుడు నిరాకరించారు. రాజ్యాంగబద్ధమైన ఉప రాష్ట్రపతిగా పని చేసిన అనంతరం మళ్లీ రాజకీయాల్లోకి రావడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అలా అనుకోవడం వల్లే తాను క్రియాశీలక రాజకీయాల్లోకి మళ్లీ అడుగుపెట్టదలచుకోలేదని పేర్కొన్నారు.
ప్రజా జీవితంలో మాత్రం క్రియాశీలకంగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు, ఇతర అంశాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో చర్చించానని అన్నారు. మళ్లీ పార్టీలోకి వెళ్లాలనే ఆలోచన కూడా లేదని వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రజలు ఎదుర్కొనే అంశాలు, రాజకీయాలపై స్పందిస్తుంటానని, అది వ్యక్తిగతమేనని చెప్పారు.
ఈ రోజుల్లో పార్టీ ఫిరాయింపులు అనేవి ఓ ట్రెండ్‌గా మారిందని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. ఒక పార్టీలో సుదీర్ఘకాలంగా పని చేసిన తరువాత ఏదో ఒక కారణంతో అందులో నుంచి బయటికి వస్తున్నారని పేర్కొన్నారు. అన్ని పదవులకు రాజీనామా చేసిన తరువాత ఏ పార్టీలోనైనా చేరవచ్చని, వారికి ఆ స్వేచ్ఛ ఉందని అన్నారు.

అంతేగానీ- ఒక పార్టీలో కొనసాగుతూ దానిపైనే విమర్శలు చేయడం మంచిది కాదని వెంకయ్య నాయుడు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత తాము ఎలాంటి హామీలను నెరవేర్చగలుగుతామో అలాంటి హామీలను మాత్రమే రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చాల్సి ఉంటుందని అన్నారు.
డబ్బులు చెట్లకు కాయవనేది వాస్తవం అని, అందుకే తాను ఉచితాలకు తీవ్రంగా వ్యతిరేకిస్తానని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. విద్య, వైద్యం మాత్రం ప్రజలకు ఉచితంగాగానే అందజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలు కూడా ఉచిత పథకాల గురించి నాయకులను ప్రశ్నించాలని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications