విజయవాడలో భారీ వర్షం-ఎట్టకేలకు వడగాల్పుల నుంచి జనానికి ఊరట...
ఏపీలో నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే క్రమంలో విజయవాడలోనూ ఇవాళ మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులతో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం.. అనంతరం వర్షంతో మరింత కూల్ అయిపోయింది. దీంతో రెండు నెలలుగా తీవ్ర వడగాల్పులతో ఇబ్బందులు పడుతున్న నగర ప్రజలకు భారీ ఊరట కలుగుతోంది.
విజయవాడలో రెండు గంటలుగా భారీ వర్షం కురుస్తుండటంతో జనానికి ఊరటగా మారింది. భారీ వర్షంతో నగరంలోని ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. శివారు ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. దీంతో రైతులు కూడా తొలకరి జల్లులతో ఊరట పొందుతున్నారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినా బిపర్ జోయ్ తుపాను కారణంగా విస్తరణ ఆలస్యం కావడంతో రైతులు, సాధారణ ప్రజలు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇవాళ వారి ఎదురుచూపులు ఫలించాయి.

సాధారణంగా వేసవిలో విజయవాడ, గుంటూరు నగరాల్లో ఉష్ణోగ్రతలు ప్రతీ ఏటా తీవ్రంగానే ఉంటాయి. అయితే ఈసారి అవి మరింత ఎక్కువయ్యాయి. దాదాపు 47 డిగ్రీల ఎండతో నగర వాసులు అల్లాడారు. బయటికి రావాలంటేనే భయపడే విధంగా వడగాల్పులు కూడా వీచాయి. జూన్ తొలివారం కల్లా రుతుపవనాలు ప్రవేశించి వర్షాలు పడతాయని ఆశించినా అలా జరగలేదు. దీంతో వేడిమికి అల్లాడుతున్న విజయవాడ వాసులకు ఇవాళ భారీ వర్షం పలకరించింది.












Click it and Unblock the Notifications