అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెక్రటేరియట్ లో పని...కానీ కనీస వేతనానికి దిక్కులేదు:హౌస్ కీపింగ్ సిబ్బంది కష్టాలు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

Recommended Video

సెక్రటేరియట్ లో పని...కానీ కనీస వేతనానికి దిక్కులేదు

పేరు గొప్ప...ఊరు దిబ్బ అనే సామెత అక్షరాలా అతికినట్లు సరిపోతుంది ఆ చిరుద్యోగుల జీవితాలకు...ఎలాగంటే?...వీళ్లు పనిచేసేది సాక్షాత్తూ రాష్ట్ర పరిపాలనను శాసించే సచివాలయంలో...కానీ కష్టాలు చూస్తే కూలీకి వెళ్లే వాళ్లకంటే ఎక్కువ!...ఇంతకూ వీళ్లెవరంటే...ఎపి సెక్రటేరియట్లో హౌస్ కీపింగ్ ఉద్యోగులు...

రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా ప్రభుత్వ శాసనాధిపతులు,పాలనాధికారులు కొలువై ఉండే అంతటి కీలక ప్రదేశంలో ఉద్యోగం చేస్తూ కూడా...వీళ్లు కనీసం వేతనానికే కాదు...కొన్నిసార్లు అసలు వేతనానికే నోచుకోవడం లేదంటే వీళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పరిపాలన మూలాలు ఆరంభమయ్యే ఆ భవనంలోనే...శాసనాధిపతులకు నెలవైన ఆ ప్రదేశంలోనే ఇంత అన్యాయం జరుగుతున్నా పట్టించుకునే నాథుడు లేకపోవడం...మన వ్యవస్థలో లోపాన్ని తేటతెల్లం చేస్తోంది.

ఉపోద్ఘాతం...బంగారు కలలు

ఉపోద్ఘాతం...బంగారు కలలు

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం...భవిష్యత్తులో ప్రపంచ అత్యుత్తమ నగరం...ఈ వరల్డ్ బెస్ట్ సిటీ నిర్మాణంతో జీవితాలు ఊహించని విధంగా మారిపోతాయి. భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయి. ఇక అక్కడ కష్టాలు కన్నీళ్లుకు తావే లేదు...పంటలు లేకపోయినా పనులకు మాత్రం కొదువ ఉండదు...ఈ ఉపోద్ఘాతం అంతా వింటుంటే ఏ స్వామీజోనో స్వర్గం గురించి భక్తులకు వివరిస్తున్నట్లుగా ఉందా?...కానీ ఇవి అమరావతి రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ సమయంలో అక్కడి రైతులకు... స్థానికులకు చెప్పిన మాటలట!..అలా చెప్పే అక్కడి జనాలు భూములు ఇచ్చేందుకు ఒప్పించారట.

 హామీల వర్షం...అలా మొదలైంది

హామీల వర్షం...అలా మొదలైంది

ఒక్క మాటలో స్వర్గం అంటే ఎక్కడో కాదు ఇప్పుడు ఇక్కడ కట్టేదే అనే టైపులో...మంత్రులు, అధికారులు రాజధాని ప్రాంత గ్రామాల్లో ఇలాంటి మాటలే చెబుతూ అదే పనిగా కాలికిబలపం కట్టుకున్నట్లు తిరిగారట. ఇకమీదట వ్యవసాయ కూలీలకు రూ.2,500 పెన్షన్‌, నిరుద్యోగ యువతకు ఉపాథి గ్యారెంటీ హామీలనూ కుమ్మరించారు. దీంతో ప్రపంచ స్థాయి రాజధాని అమరావతికి మనవంతు సహకారం అందించాల్సిందేనని...ఆ బంగారు భవిష్యత్తును అస్సలు మిస్సవకూడదని అక్కడ వాళ్లందరూ అనుకున్నారట. ఈ క్రమంలో అలాంటి అతి గొప్ప అమరావతిలోని ఇంకా గొప్పదైన సచివాలయంలో పని చేసే అవకాశం...అది హౌస్ కీపింగ్ పనే అయినా... ఎంతో ఆనందంగా చేరారట స్థానికులు. అలా ఔట్ సోర్సింగ్ విధానంలో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన సుమారు 200 మంది(వీళ్లలో అత్యధికులు మహిళలు) సెక్రటేరియట్ లో హౌస్‌ కీపింగ్‌ పని కోసం చేరటం జరిగింది.

పని ఇది...వాస్తవం ఏమిటంటే?...

పని ఇది...వాస్తవం ఏమిటంటే?...

ఇలా సెక్రటేరియట్ లో హౌస్ కీపింగ్ కోసం చేరిన వారిలో అత్యధిక శాతం అంతకుముందు వ్యవసాయకూలీలు, సన్నచిన్నకారు రైతు కుటుంబాలకు చెందిన వారు. లక్షలాది, వేలాది జీతాలు తీసుకునే పాలనాధిపతులతో,ఉద్యోగులతో కళకళలాగే ఈ రాష్ట్ర పరిపాలనా కేంద్రాన్ని ఎల్లప్పుడూ తళతళలాగే ఉంచడమే ఈ హౌస్ కీపింగ్ సిబ్బంది. ఔట్‌సోర్సింగ్‌ విధానంలో నియమించబడిన ఈ సిబ్బంది ఇప్పుడు మెల్లిమెల్లిగా తమ కష్టాల చిట్టా విప్పుతున్నారు. కన్నీళ్ల వివరాలు వెల్లడిస్తున్నారు. అసలు వీరి ప్రధాన సమస్య కనీస వేతనాలు లేకపోవడం...భవిష్యత్తు గురించి యోచించో...లేక వేరే గతిలేకో ఇక్కడ పనుల్లో చేరిన వీళ్లకు నెలంతా పనిచేసినా వేతనం కూడా కరువేనట...అయినా ప్రతి రోజూ చివాట్లు, ఛీత్కారాలూ మాత్రం తప్పవట.

 కష్టాలు...కన్నీళ్లు..కారణాలు

కష్టాలు...కన్నీళ్లు..కారణాలు

రోజుకు 8 గంటలకుపైగా కష్టపడుతున్నా తమకు నెలకు జీతంగా చేతికొచ్చేది రూ.6,500లేనని చెబుతున్నారు. అదీ గత మూడు నెలలుగా ఈ వేతనాలూ అందడం లేదని వారు వాపోతున్నారు. సిఎంతో సహా వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులంతా ఇక్కడే ఉన్నా తమ ఇబ్బందులను మాత్రం ఎవరికీ చెప్పుకోలేక పోతున్నామని మథనపడిపోతున్నారు. కారణం...తమకు ఒక యూనియన్ లాంటిదేమీ లేదని...పిల్లి మెడలో గంట కట్టేదెవరనే చందంగా ఎవరెళ్లి ఎవరితో ఏం చెబితే ఎవరికి మూడుతుందో ననే భయం...ఉన్న ఉద్యోగం కూడా అర్థాంతరంగా పోతే పరిస్థితి ఏమిటనే ఆందోళన తో అలాగే ఉగ్గబట్టుకొని జీవితాలు ముందుకు ఈడుస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని...బతుకుచిత్రాలు

కొన్ని...బతుకుచిత్రాలు

గతంలో తన భర్తతో కలిసి కూలీకెళ్తే రోజుకు తమ కుటుంబానికి సుమారు రూ.800 నుంచి రూ.1000 వరకు వచ్చేదని, ప్రస్తుతం తమ గ్రామంలో మగవారికి పనులు లేకపోగా, తమకు వచ్చే వేతనం సరిపోవడవం లేదని హౌస్‌కీపింగ్‌లో పనిచేస్తున్న మందడం గ్రామానికి చెందిన ఓ మహిళ వాపోయింది. ఇక్కడ గొడ్డు చాకిరీ సహా వేధింపులూ అధికమేనని ఆవేదన వ్యక్తం చేసింది. రాజధానిలో తమ జీవితాలు బాగుపడతాయనుకుంటే కుటుంబం గడవడమే కష్టమైందని ఆమె కన్నీళ్లుపెట్టుకుంది. తాను ఎన్నో చోట్ల పనులను చేసినా ఇక్కడున్నంత వేధింపులు ఎక్కడా లేవని 50 ఏళ్ల మరో మహిళ భోరుమంది. సూపర్‌వైజర్‌కు నచ్చకపోతే దూరంగా ఉంటే బ్లాక్‌కు వెళ్లమంటాడని, అక్కడికెళితే వారు వెనక్కి పంపుతుంటారని, ఇలా కాళ్లునొప్పి పుట్టేలా తిప్పి తిప్పలు పెడుతుంటారని ఆమె వివరించింది.

బతుకులు...బాగుపడతాయా?...

బతుకులు...బాగుపడతాయా?...

తనకు పని చేసే ఓపిక లేకపోయినా ఇల్లు గడవడానికే వస్తున్నానని ఈ 50 ఏళ్ల మహిళ వాపోయింది. తాము తీసుకెళ్లే కొద్దిపాటి డబ్బూ తిండికే చాలకున్నా, ఇంటి వద్ద ఖాళీగా ఉండే మగవారు దీంట్లోంచే కొంత తాగుడుకు తగేలేస్తున్నారని విలపించిందామె. జ్వరమోచ్చి సెలవుపెట్టినా ఇచ్చే అరకొర వేతనాల్లోనూ కోత పెడుతన్నారని తెలిపింది. గతంలో ఇదే ప్రాంతంలో ఏ వ్యవసాయ పనికెళ్ళినా మగవారికి ఏడెనిమిది వందలు కూలీ వచ్చేదని ఇక్కడే హౌస్ కీపింగ్ పనులు చేస్తున్న వెంకటపాలేనికి చెందిన ఒక వ్యక్తి తెలిపాడు. ఇప్పుడిక్కడ నెలంతా నాగా లేకుండా కష్టపడు తుంటే ఆరు వేల రూపాయలకు అటూ ఇటూగా ఇస్తున్నారని...ప్రస్తుత రోజుల్లో అది ఏ మూలకు సరిపోతుందని ఆవేదన చెందాడు. రాజధాని అమరావతిలో పెద్దళ్ల బతుకుకేమీ ఇబ్బందులు లేవని, అయితే తమ బోటి చిరుద్యోగుల బతుకులే చితికి పోయాయని ఆయన వాపోయారు. ప్రభుత్వం తమ కష్టాలు గుర్తించి ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు...ఇదీ అమరావతి కొందరు అల్పజీవుల ఆవేదన.

English summary
The housekeeping staff of AP Secretariat have facing minimum wage and monthly salary problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X