ఆందోళన వద్దు: వెంకయ్య, స్మార్ట్ సిటీలు నిర్మిస్తామని
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఎవరికీ అన్యాయం జరుగదని భరోసా ఇచ్చారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తోందని.. ఎవరైనా ఉద్యోగులు అన్యాయం జరిగిందని భావిస్తే దాన్ని సంప్రదించాలని తెలిపారు. ఇది మూడు నెలలపాటు పని చేస్తుందని చెప్పారు. ప్రస్తుత ఉద్యోగుల కేటాయింపులు తాత్కాలికమేనని చెప్పారు.
ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకుని మిగితా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పోస్టుల ఖాళీలపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చూసుకుంటాయని అన్నారు. హైదరాబాద్‌కు అనుసంధానంగా స్మార్ సిటీలను నిర్మించి.. హైదరాబాద్‌పై ఒత్తిడి తగ్గిస్తామని వెంకయ్య నాయుడు తెలిపారు. పట్టణ పేదలకు వృత్తి విద్యలో శిక్షణ అందిస్తామని చెప్పారు. హైదరాబాద్ నగరంలో రోడ్ల పక్కన పడుకునే వారికి ఒక షెల్టర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

మెట్రో రైలు పనులు 25శాతం పూర్తయ్యాయని చెప్పారు. 2017 వరకు పూర్తవుతుందని వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రపంచంలోని పెధ్ద ప్రాజెక్టుల్లో ఈ మెట్రో ఒకటని తెలిపారు. పట్టణాల్లో జనభా పెరుగుతోందని, ఇది 2050 నాటికి 50శాతం పెరుగుతుందని అంచనా వేశారు. 2020నాటికి దేశంలోని ప్రజలందరికీ ఇళ్లు నిర్మించడమే తమ లక్ష్యమని చెప్పారు.
ఈ లక్ష్యం కోసం కేంద్రం ప్రభుత్వం... రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేషన్లు, ప్రైవేటు సంస్థలను కలుపుకుపోతామని చెప్పారు. వచ్చే పార్లమెంటు సమావేశాల తర్వాత సంస్కరణలపై చర్చిస్తామని చెప్పారు. పట్టణాభివృద్ధితోపాటు గ్రామీణాభివృద్ధికి కూడా తగిన ప్రాధాన్య ఇస్తామని వెంకయ్య నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలను కలుపుకుపోతామని, వారికి అవసరమైన సహకారాన్ని అందిస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ.. మంత్రులందర్నీ ఏం చేయదల్చుకున్నారో.. తమ తమ ప్రాధాన్యతలెమిటో ముందుగా నిర్ణయించుకోవాలని చెప్పినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications