ఏపి కాంగ్రెస్ లో ఆశా 'కిరణం'

ఎపీలో కాంగ్రెస్ పార్టీని పట్టాలెక్కించి పరుగులు పెట్టించే ప్రయత్నాలు స్పీడందుకున్నాయి. పోయిన చోటే వెతుక్కోవాలన్న పట్టుదలతో పార్టీ అధిష్టానం అడుగులు వేస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు ఆరాటపడుతున్నారు. నిజానికి పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మినట్లుగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తయారైంది. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు,రాష్ట్ర మంత్రులుగా చక్రం తప్పిన నేతలు ఇప్పుడు నిస్సహాయులుగా మారిపోయిన పరిస్థితి ఏర్పడింది. కేవలం రెండు నెలల్లోనే ఎపీలో కాంగ్రెస్ పరిస్థితి తారుమారైంది. ఇంత వేగంగా ఆ పార్టీ పతనమైన రాష్ట్రం మరోకటి లేదు. ఒకే ఒక నిర్ణయం పార్టీని తారుమారు చేసింది. ఫలితంగా కాంగ్రెస్ కాలగర్బంలో కలిసిపోయింది. ఇప్పుడు పురాతన తొవ్వకాల నుంచి పార్టీ ఆనవాలును బయటకు తీసి జీవం పోయడానికి కాంగ్రెస్ ఆధినాయకత్వం కసరత్తు మొదలు పెట్టింది.

ఏపిలో పార్టీని పట్టాలెక్కించి పరుగులు పెట్టించాలన్నది కాంగ్రెస్ వ్యూహం..
ముఖ్యమంత్రి పీఠం కొట్టేయాలనో, లేక 25కు 25 లోక్ సభ స్థానాలను పట్టేయాలనో ఆ పార్టీ నేతలు ఆశపడటం లేదు. ఒకటి రెండు సీట్లు గెలుచుకొని పోటీ చేసిన చాలా చోట్ల కనీసం డిపాజిట్లు తెచ్చుకుంటే చాలన్న భావనలొ కాంగ్రెస్ నాయకులున్నారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమన్ చాందీని ఇంఛార్జిగా నియమించిన తర్వాత ఎపీ కాంగ్రెస్ కు కొంచెం ఛార్జింగ్ ఎక్కినట్లు కనిపిస్తోంది.స్వతాహాగా కేరళ రాజకీయనాయకులు పనిమంతులు.నిజాయితీగా అప్పగించిన పనిని చేయడంలో వారు దిట్ట.ఎ.కె ఆంటోనీ,ఉమన్ చాందీ లాంటి వారు ఈ కోవకు చెందిన వారే. అందుకే రావడంతోనే చాందీ తన పని ప్రారంభించారు. పార్టీలో ఉండి లేనట్లుగా ఉన్న నాయకులను యాక్టివ్ చేసే పనిలో పడ్డారు. ముందుగా ఎటు వెళ్లాలో తెలియక నాలుగు రోడ్ల కూడలిలో నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన కాంగ్రెస్ లోకి లాగేశారు.

కొత్త సీసాలో పాత మందు నింపే ప్రయత్నం..
నిజానికి కిరణ్ కు కూడా పెద్దగా ఆప్షన్స్ లేవు. టీడీపీ, వైసీపీ లో చేరడానికి అవకాశం లేదు.ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీలో చేరడమంటే నడుముకు రాయి కట్టుకొని బావిలో దూకినట్లే. అందుకే తన పుట్టింటికే చేరుకోవడానికి కిరణ్ సిద్ధమయ్యారు. కిరణ్ రాకతో ఎపీ కాంగ్రెస్ కు అంతో ఇంతో ఊపు రావడం ఖాయం. ఇప్పటికిప్పుడు ఆయన పార్టీని హనుమంతుడిలా లేపలేకపోయినప్పటికి దీర్షకాలంలో ఫలితాలను రాబట్టే ఛాన్స్ కిరణ్ కుమార్ రెడ్డికి ఉంది.తనతో పాటు మంచి టీంను సిద్ధం చేసుకుంటే కాంగ్రెస్ కు మంచి రోజులు ఖాయం. అన్ని కలిసి వచ్చి కేంద్రంలో పార్టీ అధికారంలోకి వస్తే ఆయనకు మంచి బలం వస్తుంది.

పోటీలో నిలిస్తే చాలనుకుంటున్న కాంగ్రెస్.. తర్వాత సత్తా చాటేందుకు ప్రణాళికలు..
మరో వైపు ఇప్పటికీ కాంగ్రెస్ కు ఎపీలో మంచి నాయకత్వమే ఉంది. దాదాపు అన్ని జిల్లాల్లో సీనియర్ నాయకులున్నారు. వీరంతా ఐక్యంగా ముందుకు కదిలితే పార్టీకి మంచి రోజులు రావోచ్చు. ఇదే సమయంలో వ్యక్తిగత బలంతో పాటు పార్టీ కూడా కలిసి వస్తే గెలుపు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.అయితే రాజకీయ సమీకరణాలే కాంగ్రెస్ కు శాపంగా మారుతున్నాయి.నిన్నమొన్నటి వరకు ఎపీలో కాంగ్రెస్ మూడోస్థానంలో ఉంది.బాగా కష్టపడి టీడీపీ,వైసీపీ కి ప్రత్యామ్నాయం కావొచ్చని నిన్న,మొన్నటి వరకు ఆ పార్టీ నాయకులు ఆశపడ్డారు.కాని ఇప్పుడు మధ్యలో పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యాడు.అధికారమే లక్ష్యంగా జనసేన పార్టీ రాష్ట్రంలో హడావుడి చేస్తోంది.ఇదే సమయంలో అవినీతి కేసులతో జగన్ పార్టీ ఎగిరిపోతుందన్న కాంగ్రెస్ అంచనా తారుమారైంది.

పొత్తులపై నమ్మకం లేదు.. ఒంటరిగానే బరిలోకి..
పాదయాత్రతో వైసీపీ పటిష్టంగా మారుతోంది. కేంద్రం అండ చూసుకొని బలపడటానికి బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది.ఇలా కాంగ్రెస్ కు రాజకీయ ప్రత్యర్థుల సంఖ్య పెరిగిపోయింది.దీంతో ఆ పార్టీ స్థానం మూడు నుంచి కిందకు జారిపోయింది. మరో వైపు కాంగ్రెస్ తో పొత్తుకు ఏ పార్టీ సిద్ధంగా లేకపోవడం మరో విషాదం. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్క తెలుగుదేశం తప్ప కాంగ్రెస్ మీద సానుభూతి చూపించే పార్టీయే లేదు. టీడీపీ కూడా ముందస్తు పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపించడం లేదు. అంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాల్సిందే. ఇన్ని అవాంతరాలను తట్టుకొని ఈ సీనియర్ పార్టీ నిలబడుతుందో లేక పూర్తిగా రిటైర్మెంట్ తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!