ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు ?
ఏపీలో ప్రభుత్వం భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేసేందుకు సిద్ధమైంది. గత నెలలోనే ఈ బదిలీలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ సీఎం జగన్ ఆమోదం లభించకపోవడంతో వాయిదా పడింది. దీంతో ఇప్పుడు భారీ ఎత్తున బదిలీలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.
ఈ నెలతో వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో కీలకమైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అసలే ముందస్తు ఎన్నికల ఊహాగానాలు కూడా వెలుపడుతున్న నేపథ్యంలో పరిస్ధితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. దీంతో సాధ్యమైనంత వరకూ తమకు అనుకూలంగా ఉండే అధికారుల్ని కీలక స్ధానాల్లో నియమించేలా ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు రాష్ట్రంలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలపై ప్రజా ప్రతినిధుల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. వీరి స్ధానంలో మరొకరిని నియమించాలనే ప్రతిపాదనలు కూడా అందాయి. దీనిపై ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ కానీ కుదరకపోతే రేపు కానీ ఈ బదిలీలపై జీవో ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఏడాదిలో ముఖ్యమైన అధికారులకు కీలక స్ధానాలు దక్కే అవకాశం ఉండటంతో అధికారుల్లోనూ దీనిపై టెన్షన్ నెలకొంది.












Click it and Unblock the Notifications