ముంచుకొస్తున్న మరో ముప్పు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!!
కోస్తా జిల్లాలను మరో ముప్పు వెంటాడుతోంది. బంగాళాఖాతంలో మళ్లీ వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. రానున్న 48 గంటల పాటు ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇప్పటికే భారీ వర్షాలు మొదలయ్యాయి. దీంతో, ప్రభుత్వం అప్రమత్తం అయింది.
తాజా హెచ్చరిక
వరద ప్రభావం నుంచి కోలుకోకముందే మరో ముప్పు వెంటాడుతోంది. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రెండు రోజులుగా కోస్తాలో అనేక ప్రాంతాల్లో ముసురు పట్టి ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతుండగా.. రానున్న 48 గంటల పాటు ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమలోనూ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలకు రెడ్ అలర్ట్, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

అప్రమత్తం
విజయవాడ వరదలతో పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం జరిగింది. భారీ వర్షాలు, వరదలతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 45 మంది చనిపోయారు. ఎన్టీఆర్ జిల్లాల్లో 35 మంది వరదల కారణంగానే మృతి చెందారు. ఇద్దరు గల్లంతయ్యారు. 16 జిల్లాల్లో 5.15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కృష్ణానదికి రికార్డు స్థాయిలో దాదాపు 11.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. వర్షాలు, వరదలకు ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది.
మొదలైన వర్షాలు
మరోవైపు గోదావరికి వరదలొస్తున్నాయి. ఈ సమయంలో ఉత్తరాంధ్రలోనూ భారీ వర్షాలు కురిస్తే.. ఏలేరు రిజర్వాయర్‌కు వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, వంశధార, నాగావళి నదులకు వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లోనూ వాగులు, వంకలు పొంగి ప్రవహించే సూచనలున్నాయి. సీఎం చంద్రబాబు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసారు. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.












Click it and Unblock the Notifications