ఏపీకి తీవ్ర హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని ఉంది. సముద్ రమట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఒక ద్రోణి అంతర్గతంగా కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్ వరకు కొనసాగుతోంది. ఈ ప్రభావం వల్ల విస్త్రతంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
రాష్ట్రంలో కొద్దిరోజుల నుంచి భిన్నమైన వాతావరణం కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో వేసవి కాలంలో ఉన్నట్లుగా ఎండలు మండిపోతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు కురుస్తున్నాయి. ఇటువంటి భిన్నమైన వాతావరణాన్ని, వర్షాకాలంలో ఈ తరహా ఎండలను చూడలేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దేశం మొత్తంమీద అత్యధికంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తునిలో 38.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. దీనివల్ల కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, పగటిపూట ఎండ తీవ్రత, ఉక్కపోత కూడా అలాగే ఉంటాయని వాతావరణ శాఖ అంటోంది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, కడప, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలకు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గుంటూరు జిల్లా లాంలో 62.5 మిల్లీ మీటర్లు, బాపట్లలో 60 మిల్లీ మీటర్లు, అనకాపల్లిలో 40 మిల్లీ మీటర్లు, నెల్లూరు జిల్లా రాపూరులో 36 మిల్లీ మీటర్లు, ఏలూరు జిల్లా పోలవరంలో 28 మిల్లీమీటర్లు, నెల్లూరు జిల్లా కందుకూరులో 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.












Click it and Unblock the Notifications