పోలీసులు అలా, పవన్-జగన్ ఇలా: 'రాష్ట్రం పరువు తీయకండి', వారికి హక్కుందని..
ఏపీకి ప్రత్యేక హోదా కోసం విశాఖ ఆర్కే బీచ్‌లో రేపు (జనవరి 26, గురువారం) జరగనున్న నిరసన ప్రదర్శన ఏపీలో వేడి రాజేస్తోంది.
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా కోసం విశాఖ ఆర్కే బీచ్‌లో రేపు (జనవరి 26, గురువారం) జరగనున్న నిరసన ప్రదర్శన ఏపీలో వేడి రాజేస్తోంది. ఈ నిరసనకు జనసేన అధినేత పవన్, వైసిపి చీఫ్ జగన్, ప్రజా సంఘాలు, విపక్షాలు మద్దతు పలుకుతున్నాయి.
అధికార బీజేపీ, టీడీపీలు మాత్రం దీనిని తప్పుబడుతున్నాయి. హోదాకు సమానమైన ప్యాకేజీ ఇచ్చినప్పుడు ఇంకా నిరసన ఎందుకని అడుగుతున్నారు. రేపటి ప్రదర్శనను అడ్డుకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని విపక్షాలు చెబుతున్నాయి. మొత్తానికి టిడిపి ప్లస్ బీజేపీ ప్లస్ పోలీసు వర్సెస్ పవన్ కళ్యాణ్ ప్లస్ జగన్ ప్లస్ కాంగ్రెస్ ప్లస్ ప్రజా సంఘాలుగా మారింది.

రాష్ట్రం పరువు తీయొద్దు
ఎల్లుండి (శుక్రవారం) విశాఖలో భాగస్వామ్య సదస్సు ఉన్నందున ధర్నాల పేరుతో రాష్ట్రం పరువు తీయవద్దని విశాఖ తెలుగు యువత నేత శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. భాగస్వామ్య సదస్సు కారణంగా రేపు, ఎల్లుండి తలపెట్టిన ఆందోళన, ప్రదర్శన కార్యక్రమాలను మానుకోవాలన్నారు.

అనుమతులకు పోలీసులు నో
ప్రత్యేక హోదా కోసం గురువారం నిర్వహించే కొవ్వొత్తుల ప్రదర్శన, ర్యాలీల కోసం కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, పలు సంఘాలు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే, ఆ దరఖాస్తులను పరిశీలించిన పోలీసులు అనుమతులకు నిరాకరించారు. 26న రిపబ్లిక్ డే, 27న భాగస్వామ్య సదస్సు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.
హోదా నిరసన కార్యక్రమాలకు తల్లిదండ్రులు తమ పిల్లలను పంపించవద్దని పోలీస్ కమిషనర్ యోగానంద్ విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

చంద్రబాబుపై రోజా ఆగ్రహం
ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని వైసిపి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ప్రత్యేక హోదాతోనే ఉద్యోగాలు వస్తాయన్నారు. 26న జగన్ చేపడుతున్న ఉద్యమంలో అందరూ పాల్గొనాలన్నారు.

పెట్టుబడులు రాకుండా చేసేందుకే..
ప్రత్యేక హోదా కోసం ఆందోళన సరికాదని టిడిపి నేతలు చెబుతున్నారు. విశాఖలో సీఐఐ సదస్సు ఉన్నందున విరమించుకోవాలని చెబుతున్నారు. సీఐఐ సదస్సును దెబ్బతీయడమే విపక్షాల లక్ష్యమని ఆరోపించారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. హోదా, ప్యాకేజీ ఏదైనా.. రాష్ట్రానికి మేలు జరగడం కావాలన్నారు.

కుట్ర, కుళ్లు రాజకీయాలు మానుకో
వైసిపి అధినేత జగన్ కుట్ర, కుళ్లు రాజకీయాలు మానుకోవాలని టిడిపి ఎంపి కేశినేని నాని అన్నారు. జల్లికట్టుకు, ప్రత్యేక ప్యాకేజీకి ఏం సంబంధమని నిలదీశారు.

వారికి హక్కుంది
విభజన ద్వారా ఏపీకి జరిగిన అన్యాయాన్ని సవరిస్తామని వెంకయ్య నాయుడు అన్నారు. ఇదే అంశాన్ని పార్లమెంటు బయట, లోపల ప్రస్తావిస్తున్నామన్నారు. ఏ రాష్ట్రానికి ఇంత తక్కువ సమయంలో ఏపీకి ఇచ్చినన్ని ప్రాజెక్టులు, పథకాలు, నిధులు ఇవ్వలేదన్నారు. రేపటి హోదా నిరసనపై మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో ఎవరి వాదన వారు చెప్పుకునే హక్కు ఉందన్నారు. అయితే, రేపటి సభలకు ఎవరు వస్తారు, ఎవరు నడిపిస్తారనేది అందరూ చూస్తారన్నారు.


Click it and Unblock the Notifications