షాకింగ్.. విజయవాడలో వరద బాధితుడి చెంప చెళ్ళుమనిపించిన వీఆర్వో!
వరదల వంటి కష్ట కాలంలో ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఓ అధికారిణి వరద బాధితుడి చెంప చెళ్లుమనిపించిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. అసలే నిరాశ్రయులై, కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్న వరద బాధితులను అయ్యో పాపం అని ఆదుకోవాల్సిన అధికారిణి కనీసం మానవత్వం కూడా లేకుండా వరద బాధితుడిని చెంపదెబ్బ కొట్టడం ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
అజిత్ సింగ్ నగర్ లో వరద బాధితుల ఆందోళన
వరద బాధితుడిని వీఆర్వో చెంప దెబ్బ కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ ఘటన నేపథ్యంలో స్థానికులు వీఆర్వో పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అసలు ఇంతకీ ఏం జరిగిందంటే. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ షాదీఖానా రోడ్డులో వరదలు వచ్చినప్పటి నుంచి తమకు ఎటువంటి ఆహారం కానీ, తాగునీరు కానీ అందడం లేదని బాధితులు ఆందోళన చేపట్టారు.

వరద సాయం అందటం లేదన్న బాధితుడిని చెంపదెబ్బ కొట్టిన వీఆర్వో
ప్రభుత్వం వరద సహాయక చర్యలను చేపట్టాలని మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించిన సచివాలయం 259 వార్డు విఆర్ఓ విజయలక్ష్మి పట్టించుకోవడం లేదంటూ వరద బాధితులు నిరసన చేపట్టారు . దీంతో ఈ విషయం పైన స్థానికులకు వీఆర్వో విజయలక్ష్మి కి మధ్య వాగ్వాదం జరిగింది. ఇక ఆగ్రహంతో ఊగిపోయిన వీఆర్వో విజయలక్ష్మి తమకు ఏ వసతులు అందడం లేదని ఆందోళన చేస్తున్న వ్యక్తి చెంప చెళ్లుమనిపించింది.
వీఆర్వో చెంప దెబ్బ కొట్టిన వీడియో వైరల్
వీఆర్వో ఓ వ్యక్తిని చెంపపై కొట్టడాన్ని అక్కడ ఉన్న కొందరు వీడియో తీశారు. అక్కడే పోలీసులు ఉన్నప్పటికీ స్థానికులపై దుర్భాషలాడిన విఆర్వోను పోలీసులు ఏమి పట్టించుకోకుండా సైలెంట్ గా చూస్తూ ఉండిపోయారు. ఇక వీఆర్వోలుగా ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వం నియమిస్తే విజయలక్ష్మి వంటి వారు ప్రజలతోనే అనుచితంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తన భర్తను తీసుకొచ్చి బెదిరిస్తుందని స్థానికులు మండిపడుతున్నారు.
వీఆర్వో తీరుపై సర్వత్రా విమర్శలు
పోలీసులు కూడా వీఆర్వో కే సపోర్ట్ చేస్తూ తమను పట్టించుకోవడంలేదని తమ గోడు వినే నాధుడే లేకుండా పోయాడని వారు వాపోతున్నారు. ఈ ఘటనలో తమకు న్యాయం చేయాలని వీఆర్వో పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అసలే వరద ముంపుకు గురై పుట్టెడు దుఃఖంలో ప్రజలు ఉంటే వారికి కావలసిన అవసరాలు చూడాల్సిన అధికారులు ఈ విధంగా అనుచితంగా ప్రవర్తించడం పైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వీఆర్వో పైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా
ఒకపక్క సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలు కష్టాల్లో ఉన్నారని వారికి సహాయం అందించాలని అధికారులకు సూచిస్తే కష్టాల్లో ఉన్న ప్రజల పైన చేయి చేసుకున్న విఆర్వో తీరు కొందరు అధికారుల అలసత్వానికి, నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. మరి వరద బాధితుల పైన చెయ్యి చేసుకున్న ఈ వీఆర్వో పైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications