విశాఖకు పారిశ్రామిక దిగ్గజాలు - జగన్ ప్రభుత్వం ఆతిథ్యం..!!
విశాఖ సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర మంత్రులు..పారిశ్రామిక దిగ్గజాలు తరలి వస్తున్నారు.
విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ కు సర్వం సిద్దమైంది. ఏపీ ప్రభుత్వం ఈ సదస్సును ప్రతిష్ఠాత్మంగా నిర్వహిస్తోంది. ఇందు కోసం భారీ ఏర్పాట్లు చేసింది. కేంద్ర మంత్రులతో పాటుగా జాతీయ - అంతర్జాతీయ ప్రముఖులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఒక్క రోజులోనే నాలుగు వేలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇప్పటి వరకు 12 వేల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహిస్తోంది. విశాఖకు చేరుకుంటున్న ప్రముఖులకు ఏపీ ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తోంది. సీఎం జగన్ మూడు రోజులు విశాఖలోనే ఉండనున్నారు.

కేంద్ర మంత్రులు..ప్రముఖుల రాక
విశాఖ సదస్సులో పాల్గొనేందుకు ఆరుగురు కేద్ర మంత్రులు..కార్యదర్శులు విశాఖ చేరుకుంటున్నారు. కేంద్ర మంత్రుల్లో నితిన్ గడ్కరీ, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. ముగింపు సమావేశానికి కేంద్ర మంత్రి శర్బానం సోనావాల్, కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తో పాటుగా భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెరక్టర్ డాక్టర్ సుచిత్రా ఎల్లా, డాక్టర్ రెడ్డీస్ ఛైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి, వెల్ ప్సన గ్రూపు ఎండీ రాజేష్ మండవేవాలా, క్రీడాకారిణి సింధు హాజరవుతున్నారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సులో 26 దేశాల నుంచి ప్రతినిధులు తరలి వస్తున్నారు. 15 రంగాలకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. 8వేల మంది పెట్టుబడి దారులు పాల్గొంటున్నారు. సదస్సులో 137 పెవిలయన్ స్టాళ్లు ఏర్పాటు చేసారు. అతిధులకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

తరలి వస్తున్న కార్పోరేట్ దిగ్గజాలు
ఈ సదస్సు కోసం పలువురు కార్పోరేట్ దిగ్గజ ప్రముఖులు విశాఖ చేరుకుంటున్నారు. రిలయన్స్ గ్రూపు ఛైర్మన్ ముఖేష్ అంబానీ, ఆదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ ఆదానీ, ఆదిత్య బిర్లా గ్రూపు ఛైర్మన్ కుమార మంగళం బిర్లా, బజాజ్ ఫిన్ సర్వ్ ఎండీ, సీఈవో సంజీవ్ బజాజ్, జేఎస్ డబ్ల్యూ గ్రూపు ఛైర్మన్ సజ్జన్ జిందాల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ నవీన్ జిందాల్, జీఎంఆర్ గ్రూపు ఛైర్మన్ గ్రంధి మల్లిఖార్జున రావు, రెన్యూ పవర్ ఛైర్మన్ సుమంత్ సిన్హా, దాల్మియా భారత్ గ్రూపు ఎండీ పునీత్ దాల్మియా, సెంచురీ ప్లేబోర్డ్స్ ఛైర్మన్ సజ్జన్ భజాంక, పెగాసస్ క్యాపిటల్ ఫౌండర్ సీఈవో క్రైగ్ కాట్, పార్లే ఫర్ ది అడ్వైజర్స సిరిల్ గచ్, శ్రీ సిమెంట్ ఛైర్మన్ మోహన్ బంగర్, ఒబెరాయ్ గ్రూపు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అర్జున్ ఒబెరాయ్, టెస్తా కో ఫౌండర్ మార్టిన్ ఎబర హార్డ్ వస్తున్నట్లు ఇప్పటి వరకు అధికారికంగా ఖరారైంది.
ప్రత్యేక ఛార్టెడ్ ఫ్లైట్స్ - రాజమండ్రికి విమానాలు
ప్రముఖులు.. వ్యాపార దిగ్గజాల రాకతో విశాఖ విమానాశ్రయం హై సెక్యూరిటీ జోన్ గా ప్రకటించారు. వ్యాపార వేత్తలు విశాఖ కు ఛార్టెడ్ ఫ్లైట్స్ లో వస్తున్నారు. ఈ మేరకు షెడ్యూల్ వరుసగా ఖరారు చేస్తున్నారు. దీంతో.. విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్స్ పార్కింగ్ కి స్థలం సమస్యగా మారుతోంది. ఇబ్బంది లేకుండా రాజమండ్రి విమానాశ్రయంలో ప్రత్యేక విమానాలను తరలిస్తున్నారు. అక్కడ నుంచి హెలికాఫ్టర్లు సిద్దం చేస్తున్నారు. ఇప్పటి వరకు విశాఖకు వ్యాపార దిగ్గజాలు 15 విమానాల రాకకు సంబంధించి సమాచారం అందినట్లు తెలుస్తోంది. సదస్సు కోసం వచ్చే ప్రముఖుల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు సాయంత్రం విశాఖ చేరుకోనున్నారు. మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి విశాఖలోనే ఉండనున్నారు.












Click it and Unblock the Notifications