ఏపీ ఆర్టీసీ నూతన ఎండీగా ద్వారకా తిరుమలరావు నియామకం
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్పీ ఠాకూర్ రిటైర్ కావడంతో కొత్తగా ఎండీగా ప్రభుత్వం తిరుమలరావును నియమించింది. అలాగే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా ఎన్.సంజయ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత‍్యనాథ్ దాస్ ఉత్తర్వలు జారీ చేశారు.
1989 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం రైల్వే శాఖ డీజీపిగా ఉన్నారు. గతంలో ఆయన విజయవాడ సీపీగా పనిచేశారు. 1996 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఎన్ సంజయ్ ప్రస్తుతం పోలీస్ ట్రైనింగ్ అడిషనల్ డీజీగా ఉన్నారు.

ఈ ఏడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైఎస్ ఛైర్మన్, ఎండీగా మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ప్రింటింగ్, స్టేషనరీ కమిషనర్‌గా ఉన్న ఆర్పీ ఠాకూర్‌ను ఆర్టీసీ ఎండీగా నియమించారు. సోమవారం(మే 31)తో ఆయన పదవీ కాలం పూర్తయింది.పదవీ విరమణ చేసిన ఆర్పీ ఠాకూర్‌ను ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆర్టీసీ హౌస్‌లో ఘనంగా సన్మానించారు.
2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఆయన డీజీపీగా సేవలందించారు. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఠాకూర్ నియామకాన్నివ్యతిరేకించడంతో పాటు ఆయన వైఖరిపై బహిరంగంగానే విమర్శలు చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించింది.












Click it and Unblock the Notifications