మోడీపై బాబు గుర్రు: మైత్రిపై పునరాలోచన, డెడ్‌లైన్?
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహంతో ఉందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. విభజన సమయంలో ఇచ్చిన హామీలు, పునర్విభజన చట్టంలోని వాటి పైన కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుందని ఇప్పటికే ఏపీలో విపక్షాలు విమర్శిస్తున్నాయి. టీడీపీ కూడా అసంతృప్తితో ఉందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో సంబంధాలపై ఏపీ ప్రభుత్వం డెడ్‌లైన్ విధించుకుందని సమాచారం. వచ్చే బడ్జెట్ సమావేశాలతో తమ ఇద్దరి బంధాలపై స్పష్టత వస్తుందని తెలుగుదేశం పార్టీ వర్గాలు అంటున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
బడ్జెట్‌లో ఏపీని ఏ మాత్రం ఆదుకుంటారనే దాని ఆధారంగా బీజేపీతో తమ స్నేహం ఎంతకాలమనేది తేలుతుందని చెబుతున్నారని తెలుస్తోంది. సీఎం చంద్రబాబు తాజా ఢిల్లీ పర్యటనతో కేంద్రంపై మళ్లీ ఆశలు చిగురించాయని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.
ప్రత్యేక హోదా లేదా ఆర్థిక ప్యాకేజీ తదితరాల పైన మోడీ సర్కారు ఊరిస్తోందని అంటున్నారు. కనీసం రాష్ట్ర ఆర్థిక లోటును పూడ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. కేంద్రం నుండి నిధులు తేవడం లేదని విపక్షాలు దుయ్యబడుతున్నాయి.
ఉద్యోగుల పీఆర్‌సీ ఓవైపు, రాజధాని నిర్మాణం మరోవైపు లాంటి ఆర్థికంతో ముడిపడిన వ్యవహారాలతో ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో జరిగిన చంద్రబాబు తాజా ఢిల్లీ పర్యటన ఆశాజనకంగా జరిగిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ సంతృప్తి లేకుంటే బీజేపీతో తెగతెంపుల ఆలోచన కూడా లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇటీవల చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు కేంద్రం విభజన చట్టం హామీలను వేగవంతం చేయడం లేదని వాపోయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కేంద్రం హామీలు నెరవేరుస్తుందని చెప్పుకొచ్చారు. తాజాగా తమకు తాము ఏపీ ప్రభుత్వం డెడ్ లైన్ విధించుకుందని అంటున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటన
విభజనతో రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో అన్నారు. రైతు రుణమాఫీకి కేంద్రం సహకరించలేదని, రిజర్వుబ్యాంకు కూడా అంగీకరించలేదని, అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీ చేశామన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తాను ముందుకు తీసుకు వెళ్తున్నానని చెప్పారు. రైతులకు లబ్ధి చేకూరేందుకే రుణమాఫీ అన్నారు.
ఉద్యోగులను ఇబ్బంది పెట్టకూడదనే 43శాతం ఫిట్‌మెంట్‌ను ఇచ్చామన్నారు. కుటుంబంలో ప్రతి ఒక్కరికీ సెల్‌ఫోన్ ఉన్న ఈ రోజుల్లో ఇంటికి ఒక మరుగుదొడ్డి లేకపోవడం బాధాకరమన్నారు. రోజుకు వెయ్యి చొప్పున, వందరోజుల్లో లక్షమరుగుదొడ్లు కట్టిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. జూన్ నాటికి స్కూళ్లలో మరుగుదొడ్లు కట్టిస్తామన్నారు. ప్రతి మరుగుదొడ్డికి రూ.15 వేలు మంజూరు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications