రేవంత్ ఇష్యూ, బాబుకు చిక్కులేనా: అసలు స్టింగ్ ఆపరేషన్ చెల్లుతుందా?
హైదరాబాద్: ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలలో రాజకీయ వేడిని రాజేసింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ ఆమోదయోగ్యమా? కాదా? అనే చర్చ సాగుతోంది. స్టింగ్ ఆపరేషన్ పైనా చర్చ జరుగుతోంది. ఇందుకు సంబంధించి నమస్తే తెలంగాణ పత్రిక ఓ కథనం ఇచ్చింది.
స్టింగ్ ఆపరేషన్లు చట్ట వ్యతిరేకం కాదని పలు ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయని రాసింది. స్టింగ్ ఆపరేషన్లను ఎన్నికల కమిషన్, హైకోర్టులు గుర్తించడమేకాకుండా సదరు కేసులలో విచారణకు ఆదేశించిన సందర్భాలు కూడా ఉన్నాయని, జార్ఖండ్‌లో కూడా ఇదే విధమైన స్టింగ్ ఆపరేషన్ జరిగిందని రాసింది.
అప్పుడు దానిని ఓ ప్రైవేటు వార్తా చానల్ నిర్వహించిందని, ఆ స్టింగ్ ఆపరేషన్‌ను ఎన్నికల కమిషన్, ఆ రాష్ట్ర హైకోర్టు గుర్తించడమే కాకుండా దొరికిపోయిన ఎమ్మెల్యేలపై సీబీఐ చార్జిషీటు కూడా దాఖలు చేసిందని, ఈ ఉదంతం 2010లో చోటు చేసుకుందని పేర్కొంది.

రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఊహాజనిత ఆపరేషన్‌లో ఒక విలేకరి ఒక అభ్యర్థి తరఫున కొందరు ఎమ్మెల్యేలతో బేరమాడాడని, తమ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేస్తే కోటి నుంచి రెండు కోట్ల వరకూ ఇస్తామని చెప్పాడని, ఈ సమయంలో ఆరుగురు ఎమ్మెల్యేలు కెమెరాల ముందు దొరకగా, సీబీఐ ఛార్జీషీట్ దాఖలు చేసింది.
టీవీ చానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ క్లిప్పింగులను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల కమిషన్ ఈ కేసులో దర్యాప్తు చేయాల్సిందిగా విజిలెన్స్ కమిషన్‌ను ఆదేశించిందని, ఆ తర్వాత ఒక స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనవాజ్యం మేరకు దీనిపై సీబీఐ విచారణ చేపట్టిందని గుర్తు చేసింది.
తెహల్కా పత్రిక నిర్వహించిన సంచలనాత్మక స్టింగ్ ఆపరేషన్‌లో కూడా కేసులు నమోదయ్యాయని, కోబ్రాపోస్ట్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ ఆధారంగా గుజరాత్‌లోని నరోడా పాటియా మారణహోమం ఉదంతంలో కేసులు నమోదయ్యాయని పేర్కొంది.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ కూడా రాజ్‌భవన్‌లో గుట్టుగా తీసిన చిత్రాలపై సంచలనాత్మక కథనాలు ప్రసారం చేసి గవర్నర్‌నే ఆ పదవి నుంచి తొలగింపచేసిందని, ఆ సమయంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. తివారి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారని పేర్కొంది.
అయితే, టీడీపీ నేతలు మాత్రం ఇది ప్రభుత్వం కుట్రతో చేసిందని చెబుతోంది. స్టీఫెన్ సన్ అడగటంతోనే రేవంత్ రెడ్డి వెళ్లారని తొలుత వార్తలు కూడా వచ్చాయి. కుట్రపూరిత స్టింగ్ అపరేషన్ చెల్లదని న్యాయస్థానాలు 2010లో చెప్పాయని చెబుతున్నారు. మొత్తానికి, నోటుకు ఓటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో వేడిని రాజేసింది.












Click it and Unblock the Notifications