బాధేస్తోంది, స్పీకరే కారణం: అసెంబ్లీ తీరుపై చంద్రబాబు
హైదరాబాద్: అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చూస్తుంటే చాలా బాధేస్తుందని, ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదని ప్రతిపక్ష నాయకుడు, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. బిల్లును చర్చకు పెట్టారో లేదో శాసనసభ సచివాలయ కార్యదర్శికే స్పష్టత లేదని, ఈ పరిణామాలకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ కారణమని ఆయన అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు గురించి ఎవరికీ చెప్పకుండా అసెంబ్లీలో ప్రవేశపెట్టారని ఆయన అడిగారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభకు ఎందుకు రాలేదని ఆయన అడిగారు. అసెంబ్లీలో స్పీకర్ ఇష్టానుసారం వ్యవహరించడం సరి కాదని ఆయన అన్నారు.
స్పీకర్, ప్రభుత్వం అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఏ సంప్రదాయాలను కూడా పరిగణలోకి తీసుకోవడం లేదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆయన అన్నారు. గతంలో రాష్ట్రాల విభజనలో సంప్రదాయాలు పాటించారని ఆయన అన్నారు. ఆర్టికల్ 3ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. విభజనపై అసెంబ్లీలో తీర్మానం జరిగిన తర్వాతే ఆర్టికల్ 3 ప్రకారం ముందుకు వెళ్లాలని, ఇక్కడ ఆ నిబంధనలే పాటించడం లేదని ఆయన ఆయన తప్పు పట్టారు.

విభజన విషయంలో ఇరు ప్రాంతాలకు చెందినవారిని పిలిపించి, చర్చలు జరిపిన తర్వాత, అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటే మంచిదని గతంలో చాలాసార్లు సూచించానని, దానికి సమాధానమే లేదని చంద్రబాబు అన్నారు. రాజ్యాంగంలో ఎక్కడ ఉమ్మడి రాజధాని ఊసే లేదని, ఆదాయం, ఉద్యోగాలు, ఉపాధి, విద్య తదితర వాటి గురించి చెప్పడం లేదని, కేంద్రం హేతుబద్ధంగా, రాజకీయ ప్రయోజనాల కోసం ముందుకు పోతుందని, దీంతో ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు.
అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం వచ్చే వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు గవర్నర్ చేతిలో ఎలా పెడతారో చెప్పలేదని అన్నారు. తమ పార్టీని దెబ్బ తీసేందుకు ఎన్నో ప్రణాళికలు రచించారని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో ఓ పద్ధతి లేకుండా వ్యవహారం నడుపుతున్నారని, అఖిలపక్షం ఏర్పాటు చేయమంటే సమాధానం చెప్పడం లేని చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications