జగన్ ఎక్కడ మారాడు? అంతా వట్టిదే.. 'ఇదిగో సాక్ష్యం!'
విజయవాడ : రాజకీయ పార్టీల్లో.. నంబర్ వన్ లు, నంబర్ టూలు ఉండడం.. పలువురు నేతలు కేంద్రంగా పవర్ సెంటర్లు నడవడం.. చాలా సహజం. కానీ ఏపీ ప్రతిపక్ష వైసీపీలో నంబర్ వన్ కు తప్ప మరెవరికీ.. పార్టీలో అంత సీన్ ఉండదన్నది చాలాకాలంగా వినిపిస్తోన్న వాదన.
పార్టీలో జగన్ ఒక్కడికే నిర్ణయాధికారం ఉంటుందని.. కనీసం పార్టీ నేతలను సంప్రదించకుండానే.. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారనే అపవాదు జగన్ పై కొనసాగుతూ వస్తోంది. అయితే ఇటీవల జగన్ లో మార్పు వచ్చిందని, పార్టీ నేతలందరినీ కలుపుకుని పోతున్నారని ఆమధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే తాజా పరిణామాలు చూస్తుంటే మాత్రం.. జగన్ లో మార్పు వచ్చిందన్న మాట వట్టిదే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా మారాయి. కర్నూలు యువభేరీ సందర్బంగా.. 'అవసరమైతే హోదా కోసం తమ ఎంపీలతో రాజీనామా చేయించడానికైనా సిద్దం..' అంటూ జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
జగన్ మాట అలా ఉంటే.. అసలు రాజీనామాల విషయం మాతో చర్చించనే లేదు.. అంటూ మీడియా ముందుకొచ్చారు మేకపాటి. దీన్నిబట్టి.. ఎప్పటిలాగే జగన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఆ ప్రకటన చేశారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఓవైపు తమతో చర్చించలేదని చెబుతూనే.. మరోవైపు తమ అధినేత మార్గ నిర్దేశానుసారం నడుచుకుంటామని మేకపాటి చెప్పడం గమనార్హం.
అధినేత చెప్పినట్టు నడుచుకునే దానికి.. అసలాయన మాతో చర్చించలేదనే విషయాన్ని మేకపాటి మీడియాతో ఎందుకు చెప్పారో అర్థం కాదు. ఆయన చేసిన ఈ కామెంట్స్.. జగన్ కు మాత్రం ప్రతికూలంగా మారాయి. మరి వైసీపీ అధినేత జగన్.. మేకపాటి వ్యాఖ్యల పట్ల ఎలా స్పందిస్తారో!












Click it and Unblock the Notifications