అమ్మఒడిపై జగన్ సర్కార్ షాక్- 6 నెలలు వాయిదా-75 శాతం హాజరు ఉంటేనే-తీవ్ర ప్రభావం
ఏపీలో అమ్మఒడి పథకంపై ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో సమావేశమైన జగన్ కేబినెట్ అమ్మఒడి పథకం అమలును వాయిదా వేసింది. అంతే కాదు 75 శాతం హాజరు నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో వేలాది మంది విద్యార్ధులపై ప్రభావం పడబోతోంది. అలాగే వారి తల్లితండ్రులపైనా, స్కూళ్లపైనా దీని ప్రభావం ఉండబోతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమవుతోంది.

జగన్ సర్కార్ మానసపుత్రిక
అక్షరాస్యతలో అట్టగుడుగున ఉన్న ఏపీలో దాని శాతాన్ని పెంచేందుకు వీలుగా విద్యార్ధుల్ని పాఠశాలలకు తరలించేందుకు వైసీపీ సర్కార్ అమ్మఒడి పేరుతో రెండేళ్ల క్రితం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. సీఎం జగన్ మానసపుత్రిక అయిన ఈ పథకంలో భాగంగా స్కూళ్లకు పిల్లల్ని పంపే తల్లుల ఖాతాల్లో ఏటా జనవరిలో సంక్రాంతి సమయంలో రూ.14 వేల రూపాయలు ప్రభుత్వం జమ చేస్తోంది. దీంతో వీరంతా ఈ మొత్తాల్ని స్కూళ్లకు ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అలాగే విద్యార్ధులకు కావాల్సిన సౌకర్యాలతో పాటు తల్లితండ్రులు కూడా వాడుకునేందుకు వీలు కలిగింది.

రెండేళ్లలోనే భారమైన అమ్మఒడి
అమ్మఒడి పథకం అమలు కోసం ప్రభుత్వం వివిధ సంక్షేమ శాఖలు, కార్పోరేషన్ల నుంచి నిధుల్ని మళ్లిస్తోంది. దీంతో ఆయా శాఖల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పోరేషన్ల ద్వారా లబ్దిదారులకు అందాల్సిన ప్రయోజనాలు అందకుండా పోతున్నాయి. అదే సమయంలో అమ్మఒడి అమలు కోసం ప్రతీ ఏటా వేల కోట్ల మొత్తాల్ని సేకరించడం కూడా ప్రభుత్వానికి భారంగా మారిపోతోంది. దీంతో ఈ భారాన్ని కాస్తయినా తగ్గించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇందులో మార్పులు చేస్తూ ఇవాళ్టి కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకుంది.

వచ్చే జూన్ కు అమ్మఒడి వాయిదా
ఆమ్మఒడి కింద వచ్చే ఏడాది జనవరిలో విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ.14 వేల చొప్పన ప్రభుత్వం జమ చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఈసారి ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండటంతో ఈ మొత్తాల్సి జనవరిలో జమ చేసే పరిస్ధితి లేదు. దీంతో ఆరు నెలల పాటు అంటే వచ్చే ఏడాది జూన్ కు వాయిదా వేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది దీంతో రెండేళ్లుగా జనవరిలో ఠంఛనుగా అమ్మఒడి మొత్తం అందుకుంటున్న తల్లులకు ఈసారి నిరాశ తప్పడం లేదు. అయితే ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయాన్ని సమర్ధించుకుంటోంది.

75 శాతం హాజరూ తప్పనిసరి
అమ్మఒడి పథకం అమల్లోకి తెచ్చినప్పుడు వైసీపీ సర్కార్ 75 శాతం హాజరు ఉంటేనే ఇస్తామని స్పష్టం చేసింది. అయితే కరోనా కారణాలతో రెండేళ్లుగా నిర్ణీత హాజరు శాతం లేకపోయినా అమ్మఒడి మొత్తాల్ని తల్లుల ఖాతాల్లో యథావిధిగా జమ చేస్తూనే ఉంది. ఇఫ్పుడు ఆర్ధిక ఇబ్బందులు పెరగడం, కరోనా వ్యాప్తి కూడా తగ్గడంతో 75 శాతం హాజరు నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ విద్యాసంవత్సరంలో 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి పథకానికి అర్హులంటూ ఆదేశాలు జారీ చేయబోతోంది. అయితే దీనిపై ఇప్పటికే లీకులు రావడంతో తల్లుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల్లో దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం జగన్ సలహా ఇచ్చారు.

అమ్మఒడి మార్పుల ప్రభావమిదే
అమ్మఒడి పథకంలో మార్పులుచేస్తూ ఇవాళ జగన్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాల ప్రభావం విద్యార్ధులు, తల్లితండ్రులతో పాటు స్కూళ్లపైనా పడబోతోంది.. ఇప్పటివరకూ జనవరిలో అందుతున్న అమ్మఒడి డబ్బులు ఈసారి అందే అవకాశం లేకపోవడంతో విద్యార్ధుల తల్లితండ్రులు ఫీజుల చెల్లింపు కోసం సొంతంగా డబ్బులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. మరోవైపు స్కూళ్లు కూడా అమ్మఒడి డబ్బులు రాగానే తమకు తల్లితండ్రులు ఫీజుల చెల్లిస్తారని ధీమాగా ఉండేవి. ఇప్పుడు ప్రభుత్వం అమ్మఒడిని జూన్ కు వాయిదా వేయడంతో ఈసారి వారికి ఫీజులు లభించడం కష్టమే. అలాగే రెండేళ్లుగా సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చే ఈ డబ్బులతో తల్లితండ్రులు ఇంటిల్లిపాదికీ షాపింగ్ కూడా చేసుకునే వారు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోతోంది.












Click it and Unblock the Notifications