అమరావతికి జగన్ మరో గుడ్ న్యూస్- నెలరోజుల్లో రాజధాని పనులు- రూ.18 వేల కోట్ల బడ్డెట్
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఐదేళ్లలోనే అమరావతి నుంచి తరలిపోతుందన్న ఆవేదనలో ఉన్న రైతులు, స్ధానికులకు జగన్ సర్కారు తీపి కబురు చెప్పింది. రాజధాని వికేంద్రీకరణ నేపథ్యంలో అమరావతిలో నిలిచిపోయిన పనులను కూడా పూర్తి చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయబోమనే సంకేతాలు పంపుతోంది. ఈ మేరకు మూడు రోజులుగా అమరావతి గ్రామాల్లో పర్యటించిన పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ ప్రణాళికను స్పష్టం చేశారు.

అమరావతిలో ముందడుగు....
గతేడాది వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిచిపోయిన అమరావతి రాజధాని నిర్మాణ పెండింగ్ పనులు తిరిగి త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు జగన్ సర్కారు ఓ నిర్ణయానికి వచ్చింది. విశాఖకు రాజధాని తరలింపు నానాటికీ ఆలస్యమవుతున్న తరుణంలో అమరావతిలో పెండింగ్ నిర్మాణాలను పూర్తి చేసుకుంటే వీటిని వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయించవచ్చనే ఆలోచనకు వచ్చింది. వీలైన చోట ప్రైవేటు సంస్ధలకు లీజుకు ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయం కూడా లభిస్తుందని అంచనా వేస్తోంది. అందుకే నెలరోజుల్లో అమరావతిలో పెండింగ్ పనులు తిరిగి ప్రారంభమవుతాయని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

బొత్స టూర్ ఆంతర్యమిదే...
ప్రస్తుతం రాజధాని తరలింపు నేపథ్యంలో ఇక్కడి గ్రామాల ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. చంద్రబాబు ప్రభుత్వం తమకు ఇచ్చిన రాజధానిని జగన్ లాగేసుకుంటున్నారన్న అసంతృప్తి నెలకొంది. దీంతో తమకు అన్ని ప్రాంతాలు సమానమేనన్న సంకేతాలు పంపేందుకు అమరావతిలోనూ అభివృద్ధి మంత్రం జపించాలని వైసీపీ సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగానే పురపాలకమంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి స్ధానికులతో మాట్లాడారు. ఆ తర్వాత రాజధాని పనులను నెల రోజుల్లో తిరిగి ప్రారంబిస్తామనే ప్రకటన చేశారు. ఇప్పటికే సీఆర్డీయే అధికారులు అమరావతిలో పెండింగ్ నిర్మాణాల పూర్తికి రూ.18 వేల కోట్ల ఖర్చవుతుందనే అంచనాలను సీఎం జగన్ కు అందజేశారు. దీంతో వీటిని దశల వారీగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

రాజధానిలో వ్యతిరేకతకు చెక్...
మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి రాగానే వైసీపీ ప్రభుత్వంపైనా, అందులో భాగస్వాములుగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలపైనా రాజధాని ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రాజధాని పరిధిలోకి వచ్చే మంగళగిరి, తాడికొండ ఎమ్మెల్యేలు ఆర్కే, ఉండవల్లి శ్రీదేవి అయితే ఈ ప్రాంతంలో పర్యటించడమే మానేశారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాత్రమే కాస్త ధైర్యం చేసి రాజధాని గ్రామాల్లో పర్యటిస్తూ వచ్చారు. అయితే అమరావతిలో పెండింగ్ పనులను పూర్తి చేయాలన్న నిర్ణయంతో ఈ ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతను కాస్తయినా తగ్గించవచ్చనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
Recommended Video

స్ధానిక ఎన్నికల వ్యూహం...
కరోనా వైరస్ రాకపోయి ఉంటే రాష్ట్రంలో ఇప్పటికే స్ధానిక ఎన్నికలు పూర్తయ్యేవి. వాటిలో వైసీపీ ప్రభుత్వ భవితవ్యం తేలిపోయేది. అయితే మూడు రాజధానుల నేపథ్యంలో వ్యతిరేకత లేదని చెప్పుకునేందుకు ప్రభుత్వం రాజధాని గ్రామాల్లో ఎన్నికలు వాయిదా వేసింది. పురపాలకసంఘాల పునర్ వ్యవస్ధీకరణ పూర్తి కానందున ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు అప్పట్లో చెప్పుకుంది. కానీ తాజాగా మారిన పరిస్దితుల నేపథ్యంలో అమరావతిలో పెండింగ్ నిర్మాణాలు పూర్తి చేయడం ద్వారా ఇక్కడి ప్రజల్లో అభివృద్ధి అజెండాను తీసుకెళ్లి స్ధానిక ఎన్నికల్లోనూ లబ్ది పొందవచ్చని వైసీపీ సర్కారు ఆలోచిస్తోంది.












Click it and Unblock the Notifications