ఎన్నికల వేళ చంద్రబాబుకు మరో ఝలక్-సుప్రీంకు జగన్ సర్కార్ !
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వం మరో షాకిచ్చింది. ఇప్పటికే నమోదైన ఓ కీలక కేసులో హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు త్వరలో విచారణ జరపబోతోంది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే మాత్రం చంద్రబాబుకు ఎన్నికల వేళ ఇబ్బందులు తప్పకపోవచ్చు.

గతేడాది సెప్టెంబర్లో చంద్రబాబును ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ అక్రమాల కేసులో నంద్యాలలో అరెస్టు చేసి జైలుకు పంపిన తర్వాత ఆయనపై అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పులో అక్రమాల కేసును సీఐడీ నమోదు చేసింది.ఈ కేసులో చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణను సైతం నిందితులుగా చేర్చింది. దీనిపై సీఐడీ విచారణ ప్రారంభించిన తర్వాత చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. తాజాగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో సీఐడీ కార్యాలయంలో పూచీకత్తు సమర్పించి చంద్రబాబు బెయిల్ పొందారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చంద్రబాబుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరింది.
తాజాగా ఏపీ హైకోర్టు చంద్రబాబుకు మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇందులో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుతో పాటు మద్యం, ఇసుక కేసులు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క దానిలో అయినా చంద్రబాబుకు బెయిల్ రద్దయితే ఆయన్ను తిరిగి అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేసేందుకు సీఐడీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ఐఆర్ఆర్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications