జగన్ మెడకు అమరావతి-వద్దన్న చోటే పనులకు రెడీ -అసెంబ్లీలో కొత్త బిల్లుకు తీవ్ర ఒత్తిడి
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణాలకు సరికాదంటూ లేవనెత్తిన కొత్త వాదన తేలిపోవడంతో హైకోర్టు ఆదేశాల మేరకు అక్కడ పనులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే అక్కడి రైతులకు గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిన సీఆర్డీయే చట్టం ప్రకారం ఫ్లాట్లు కేటాయించాల్సిందేనంటూ హైకోర్టు స్పష్టం చేయడంతో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు అసెంబ్లీలో మూడు రాజధానుల కొత్త బిల్లు ప్రవేశపెట్టే విషయంలోనూ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.

జగన్ మెడకు అమరావతి
విపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని సమర్ధించి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులంటూ యూటర్న్ తీసుకున్న వైఎస్ జగన్ .. దీనిపై అసెంబ్లీలో అందుకోసం రెండు బిల్లులు కూడా ప్రవేశపెట్టి ఆమోదించుకున్నారు. ఆ తర్వాత గవర్నర్ ఆమోదం కూడా పొందినా హైకోర్టులో చుక్కెదురు కావడంతో ఇప్పుడు మళ్లీ అమరావతిపై ఫోకస్ పెట్టక తప్పని పరిస్ధితులు నెలకొంటున్నాయి.
ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో దూకుడుగా ముందుకెళ్లే దారులు కూడా మూసుకుపోతున్నాయి. దీంతో ముందు అమరావతిని అభివృద్ధి చేశాకే మిగిలిన విషయాలు మాట్లాడాల్సిన పరిస్ధితి నెలకొంటోంది. దీంతో సహజంగానే ప్రభుత్వం అమరావతిలో పనుల్ని తిరిగి ప్రారంభిస్తోంది.

త్వరలో ఫ్లాట్ల కేటాయింపు
హైకోర్టు తీర్పు నేపథ్యంలో సీఆర్డీయే అధికారులు అమరావతిలో రంగంలోకి దిగారు. ముఖ్యంగా సీఆర్డీఏ చట్టంలో పేర్కొన్న విధంగా దాదాపు 23 వేల ఫ్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాల్సి ఉండటంతో అందుకోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మున్సిపల్ శాఖ నుంచి అందుతున్న ఆదేశాలతో క్షేత్రస్ధాయిలో ఫ్లాట్ల అభివృద్ధి పనులు ఊపందుకోబోతున్నాయి. అదీ హైకోర్టు పర్యవేక్షణలోనే సాగే అవకాశం ఉండటంతో ఏమాత్రం తేడా వచ్చినా తమ మెడకు చుట్టుకుంటుందన్న భయం వారిలో కనిపిస్తోంది.

అసెంబ్లీలో కొత్త బిల్లు పెడతారా?
మరోవైపు అమరావతిలో పనులు తిరిగి ప్రారంభిస్తున్న సమయంలోనే అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టి తీరుతామని బీరాలు పలికిన రాష్ట్ర మంత్రులు..ఇప్పుడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తయినా దాని గురించి నోరు మెదపడం లేదు.
హైకోర్టు తీర్పు ప్రకారం సీఆర్డీయే చట్టానికి వ్యతిరేకంగా మూడు రాజధానులపై ముందుకెళ్లే అవకాశాలు లేకపోవడం, దీనిపై అసెంబ్లీలో చేసే చట్టాలు కూడా చెల్లవంటూ హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపైనా ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.
దీంతో త్వరలో ఏదో ఒక నిర్ణయం తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్ధితి. లేకపోతే మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందంటూ విపక్షాలు విమర్శలు మొదలుపెడతాయన్న భయం వైసీపీ సర్కార్ ను వెంటాడుతోంది.












Click it and Unblock the Notifications