పరిటాల రవి హత్య కేసులో జగన్ పాత్ర - పరిటాల సునీత
మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త పరిటాల రవి హత్యలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పాత్ర కూడా ఉందని ఆరోపణలు చేశారు. పరిటాల రవి హత్య కేసులో సీబీఐ జగన్ ను కూడా విచారించిందని ఆమె గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సునీత చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
దివంగత నేత, మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 45 మంది హత్యకు గురయ్యారని ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రస్తుతం టీవీ బాంబు గురించి మాట్లాడుతున్న వారు.. నాడు జరిగిన కారు బాంబు గురించి కూడా మాట్లాడాలని అన్నారు. తోపుదుర్తి సోదరులు ఇప్పుడు రాప్తాడులో ముఠా కక్షలను రెచ్చగొడుతున్నారని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓబుల్ రెడ్డి, మద్దెలచెరువు సూరి కుటుంబాలను ఫ్యాక్షనిజంలోకి మళ్లీ లాగుతున్నారని మండిపడ్డారు.

తోపుదుర్తి సోదరుల మాటలు నమ్మి వారి కుట్రలో భాగస్వామ్యం కావొద్దని కనుముక్కల ఉమ, గంగుల భానుమతికి విజ్ఞప్తి చేస్తున్నానని సునీత తెలిపారు. ఇప్పటికే ఫ్యాక్షన్ కారణంగా మన మూడు కుటుంబాలు చాలా నష్టపోయాయని వాపోయారు. అంతే కాకుండా తోపుదుర్తి సోదరులు ఏం చెప్పినా జగన్ నమ్మేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఐదేళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి నిజానిజాలు తెలుసుకోరా? అంటూ ఘాటుగా స్పందించారు.
శుక్రవారం నాడు జగన్ పాపిరెడ్డిపల్లి గ్రామానికి వస్తానంటున్నారని.. కానీ ఆయనకు శుక్రవారం కలిసొచ్చిందేమో అంటూ సెటైర్లు వేశారు. జగన్ వచ్చేటప్పుడు తన సూట్ కేసులో కాస్త ఏకకూయ బట్టలు తెచ్చుకోవాలని.. లింగమయ్య కుటుంబాన్నే కాకుండా.. వైసీపీ వల్ల నష్టపోయిన వారి కుటుంబాలను కూడా పరామర్శించాలన్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో మళ్లీ ఫ్యాక్షన్ చిచ్చు పెట్టొద్దని కోరారు.
మరోవైపు ఫ్యాక్షన్ రాజకీయాల నేపధ్యంలో కురుబ లింగమయ్య హత్యకు గురయ్యారు. ఈ మేరకు వారి కుటుంబాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటికే పరామర్శించారు. లింగమయ్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు. తమకు ప్రాణహాని ఉందని లింగమయ్య తనయుడు చెప్పగా.. అధైర్య పడొద్దని, పార్టీ అండగా ఉంటుందని, అవసరమైన న్యాయసహాయం అందిస్తామని జగన్ భరోసా ఇచ్చారు. తానే స్వయంగా వస్తానని అంతకు ముందు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications