అమరావతి రైతుల శవాలమీదగా నడిచి వెళ్లండి!!
ఆర్5 జోన్‌లో ఒక్క ఇటుక కూడా పడకుండా అడ్డుకునేందుకు రైతులంతా ప్రత్యక్ష పోరాటానికి దిగాలని, జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. పోరాటానికి దిగకపోతే వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న కుట్రతో భారీ ప్రమాదం ముంచుకురాబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు కుటుంబాలు రోడ్డెక్కాల్సిన సమయం ఆసన్నమైందని, ఇంటికొకరు చొప్పున బయటకు రావాలన్నారు. న్యాయస్థానాలిచ్చే తీర్పులపై ఆధారపడి అలసత్వం చేయొద్దని హితవు పలికారు.
జగన్ ప్రభుత్వం మూర్ఖంగా పట్టాలను పంచాలనుకుంటే.. రాజధానిలో భూములిచ్చిన ఎస్సీ, ఎస్టీ రైతుల శవాల మీదుగా వెళ్లాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. ఇతర పార్టీలన్నీ ఐకమత్యంగా ప్రభుత్వ చర్యను నిరసించకపోతే అన్ని పార్టీల నేతలు జాతి ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. రైతులిచ్చిన భూములను పేదలకు పంచుతామనే హక్కు ముఖ్యమంత్రికి ఎక్కడుందని ప్రశ్నించారు. పేదల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

పేదలపై ప్రభుత్వానికి నిజంగా ప్రేమే ఉంటే టిడ్కో ఇళ్లు ఇవ్వాలని, నవనగరాల నిర్మాణానికి ఎక్కడెక్కడి నుంచో వైసీపీ కార్యకర్తలను తీసుకొచ్చి పట్టాలివ్వాలనుకుంటున్నారని, వాటిని అడ్డుకుంటామన్నారు. ఈనెల 26వ తేదీన జరిగే పట్టాల పంపిణీని అడ్డుకుంటామన్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి విషయంలో వ్యవహరిస్తున్న తీరును చూస్తే సీబీఐకి సిగ్గులేదనిపిస్తోందని శ్రావణ్ కుమార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యవస్థలపై స్పందిస్తున్నందుకు తమకు సిగ్గులేదనిపిస్తోందన్నారు. ఎవరైనా వేగంగా బండి నడిపితే కాలరు పట్టుకొని తీసుకొచ్చి స్టేషన్ లో కూర్చోబెడతారని, హత్యకేసులో ఇంత దారుణంగా వ్యవహరించడమేంటని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications