AP Govt: ఏపీలో కారుణ్య మరణాలకు గ్రీన్ సిగ్నల్- మార్గదర్శకాలు జారీ..!
మన దేశంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కారుణ్య మరణం (Passive Euthanasia)పొందేలా వీలు కల్పిస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఏపీ ప్రభుత్వం (AP Govt) చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలో తీవ్రమైన వ్యాధులకు గురై, చికిత్సకు లొంగని స్థితిలో, వెంటిలేటర్ సహాయంతో ఊపిరి పీల్చుకుంటూ, మరణానికి చేరువై నరక యాతనను అనుభవించే రోగులకు ఊరట కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాలకనుగుణంగా అటువంటి వారికి కారుణ్య మరణం లభించేలా విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. వ్యాధి నుంచి కోలుకునే అవకాశం ఏమాత్రమూ లేక చికిత్సల పేరిట నానా ఇబ్బందులు పడే వారికి ఈ నిర్ణయం ఎంతో ఊరట కల్పించనుంది.
అవసాన దశలో ఉన్న రోగులకు సహజ రీతిలో కారుణ్య మరణాల అవకాశాలను కల్పిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా రూపొందించిన మార్గదర్శకాలను వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించి ఆమోదం తెలిపారు. వీటి ద్వారా రోగుల స్వయం నిర్ణయాధికారాన్ని గౌరవిస్తూ చికిత్సనందించే వైద్యులు, కారుణ్య మరణాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే రోగుల కుటుంబీకులకు చట్ట పరమైన రక్షణ లభిస్తుంది. ఎటువంటి అవకతవకలకు వీలులేకుండా ఈ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయడానికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ మరియు జిల్లా స్థాయి డిఎంహెచ్వోలను ప్రభుత్వం బాధ్యులను చేసింది.

1) వ్యాధితో బాధపడుతున్న రోగి ఎటువంటి నిర్బంధానికి గురికాకుండా, పూర్తి చేతనావస్థలో ఉండి, స్వతంత్రంగా, ఇద్దరు సాక్షుల సమక్షంలో ఇక ముందు తనకందించాల్సిన చికిత్సపై పరిస్థితులకనుగుణంగా తగు నిర్ణయం తీసుకునే గార్డియన్‌ను సూచిస్తూ సంతకంతో కూడిన' ఎడ్వాన్స్ డైరెక్ట్‌వ్ 'ని రూపొందించవచ్చు. దీనిని నోటరీ లేదా గెజిటెడ్ అధికారి ధ్రువీకరించాలి.
2) చికిత్సకు లొంగక అవసాన దశకు చేరిన రోగి పరిస్థితిని చికిత్సనందిస్తున్న వైద్యులు పరీక్షించి ఎడ్వాన్స్ డైరెక్ట్‌వ్ లో పొందుపరచిన నిర్ణయాన్ని అందులో సూచించిన గార్డియన్ కు తెలియజేసి, కొనసాగుతున్న చికిత్సను ఆపివేయడం ఉత్తమమని వైద్యుడు నిర్ణయానికొస్తే ఆ సంగతి గార్డియన్‌కు వివరించాలి. ఇతరుల విషయంలో చికిత్సను ప్రారంభించడం నిష్ప్రయోజమని భావిస్తే ఆ విషయాన్ని గార్డియన్‌కు తెలపాలి.
3) అట్టి పరిస్థితుల్లో చికిత్సనందిస్తున్న ఆసుపత్రివారు అవసాన దశలో ఉన్న రోగి పరిస్థితిని పరిశీలించేందుకు, చికిత్సనందిస్తున్న వైద్యునితో పాటు 5 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన మరో ఇద్దరు వైద్యులతో ప్రైమరీ మెడికల్ బోర్డును ఏర్పాటు చేసి 48 గంటల్లో ప్రాథమిక నిర్ణయాన్ని తీసుకోవాలి.
4) రోగికి చికిత్సనందించడం నిష్ప్రయోజనమని ప్రైమరీ మెడికల్ బోర్డు భావిస్తే సదరు వైద్యుడు, డిఎంహెచ్ఓ మరియు చికిత్సతో సంబంధంలేని మరో ఇద్దరు వైద్యులతో కూడిన సెకండరీ మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలి.
5) ఈ రెండు మెడికల్ బోర్డుల అభిప్రాయాలను, గార్డియన్ సమ్మతిని ఆసుపత్రివారు చికిత్సను ఆపివేసే ముందు ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌కు తెలియజేయాలి.
6) సెకండరీ మెడికల్ బోర్డు రోగికి చికిత్సను ఆపివేయడానికి అంగీకరించనపుడు రోగి సూచించిన గార్డియన్ హైకోర్టును ఆశ్రయించ వచ్చు. హైకోర్టు 20 ఏళ్ల అనుభవంగల వైద్యులతో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేస్తుంది.
7) అవసాన దశలో ఉన్న రోగి ముందస్తుగా 'ఎడ్వాన్స్‌డ్ డైరెక్ట్‌వ్ 'ను ఇవ్వని పరిస్థితుల్లో రోగి పరిస్థితిని సంబంధిత డాక్టర్ ఆసుపత్రివారికి తెలియజేస్తే, వారు ప్రైమరీ మెడికల్ బోర్డును ఏర్పాటు చేసి రోగి సంబంధించిన వారితో చికిత్సను ఆపివేయడం లేక ప్రారంభించకపోవడం వలన కలిగే పరిణామాలను క్షుణ్ణంగా వివరించి వాటిని రాతపూర్వకంగా పొందుపరుస్తారు. అనంతరం సెకండరీ మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తారు. భిన్నాభిప్రాయాలు ఎదురైతే రోగి సంబంధీకులు హైకోర్టును ఆశ్రయించవచ్చు.

8) చివరిగా రోగికి లైఫ్ సపోర్టును తొలగిస్తే ఆ సంగతిని సంబంధిత మేజిస్ట్రేట్ హైకోర్టుకు తెలియపర్చాలి.
9) ఈ ప్రక్రియకు సంబంధించిన రికార్డుల్ని రోగి మరణానంతరం మూడేళ్ల వరకు భద్రపర్చాలి.
కారుణ్య మరణాలకు వీలు కల్పించే ఈ ప్రక్రియను అత్యంత పటిష్టంగా పర్యవేక్షించాలని, ఏ దశలోనూ పొరపాటు జరక్కుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు.














Click it and Unblock the Notifications