బెయిల్ పక్షి సిఎం ఎలా అవుతారు: జగన్‌పై జైరాం ఫైర్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కేంద్రమంత్రి జైరాం రమేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన గురువారం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అవినీతి అక్రమాలకు పాల్పడిన జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సీమాంధ్రకు ముఖ్యమంత్రి ఎలా అవుతారని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిని ఎవరూ కేసుల్లో ఇరికించలేదని, ఆయన చేసిన మోసాల కారణంగానే జైలు పాలయ్యారని తెలిపారు.
జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చిన రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి కావడం గతంలో ఎన్నడూ జరగలేదని జైరాం అన్నారు. అసలు అటువంటి పరిస్థితినే తాను జీర్ణించుకోలేనని చెప్పారు. మరి, కొత్త రాష్ట్ర ముఖ్యమంత్రిగా అలాంటి వాడిని ఎన్నుకోవాలో లేదో అక్కడి ప్రజలే తేల్చుకోవాలని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. అవినీతి కేసుల్లో ఇరుక్కుని బెయిల్‌పై బయటకు వచ్చిన వాడికి ఓటు వేయాలో లేక సీమాంధ్ర ప్రయోజనాలను పరిరక్షించిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తేల్చుకోవాలని హితవు ఆయన పలికారు.
జగన్ కాంగ్రెస్ డిఎన్ఏ అన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారా ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ మాటలను తాను అంగీకరించబోనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 'మా నేతలు ఎవరూ బెయిల్ మీద లేరు' అని జైరాం వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘జగన్ చరిత్రను చూడండి. ఆయన ఖర్చు పెడుతున్న నిధులు చూడండి. మీరే గ్రహిస్తారు. రాజకీయాల్లో తిరిగి చెల్లించడాలులు ఉండవు. ముడుపులు మాత్రమే ఉంటాయని జగన్ నిరూపించారు' అని చెప్పారు. జగన్ పార్టీ గతంలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని విధంగా అపరిమిత స్థాయిలో భారీ ఎత్తున ఖర్చు పెడుతోందని ఆరోపించారు.

కొత్త రాష్ట్ర ముఖ్యమంత్రిగా అలాంటివాడిని ఎన్నుకోవాలా లేదా అని ప్రజలు తేల్చుకోవాలన్నారు. ‘దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరిట ఓట్లడిగే హక్కు, కాంగ్రెస్ పేరును ఉపయోగించుకునే హక్కు జగన్‌కు లేవు. ఏ అధికారంతో వైఎస్ పేరును, కాంగ్రెస్ పేరును వాడుతున్నారో జగన్ చెప్పాలి' అని జైరాం డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలనే ఆయన అమలు చేశారని చెప్పారు. మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డిలాగే జగన్ కూడా కాంగ్రెస్‌ను మోసగించారన్నారు.
సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ కిరణ్ కుమార్ రెడ్డే కారణమని జైరాం ఆరోపించారు. ఎన్నడూ ఆయన బాధ్యత గల ముఖ్యమంత్రిగా వ్యవహరించలేదని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు, కిరణ్ ఇద్దరూ కలిసి ప్రజలను రెచ్చగొట్టారని ధ్వజమెత్తారు. పార్టీని ధిక్కరించిన రోజే కిరణ్‌పై చర్య తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే బిజెపికి వేసినట్లేనని అన్నారు. అయితే, ప్రజలు చంద్రబాబు నాయుడును ఎన్నుకుంటే సీమాంధ్రను అభివృద్ధి చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతు ఇస్తుందని జైరాం రమేశ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications