కాంట్రాక్టర్లకోసం కాదు: పోలవరంపై జైరాం, నేతలు దూరం
ఏలూరు: పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ల కోసం కాదని, సీమాంధ్రుల కోసమని కేంద్రమంత్రి జైరామ్ రమేష్ మంగళవారం అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్న జైరాం విభజనలో కీలక అంశంగా మారిన పోలవరం ప్రాజెక్టు స్థలాన్ని మంగళవారం ఉదయం పరిశీలించారు.
తర్వాత దేవరగొంది నిర్వాసితులతో జైరాం ముఖాముఖి నిర్వహించారు. ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తే ముంపు ప్రాంతాల సంఖ్య తగ్గుతుందా అని అధికారులను జైరాం అడుగగా, ఎత్తు తగ్గింపు సాధ్యం కాదని అయితే, పరిశీలిస్తామని చెప్పారు.

ప్రాజెక్టు నిర్మించే కాంట్రాక్టర్ వివరాలను జైరాం అడిగి తెలుసుకున్నారు. పోలవరంపై బలరాం నాయక్ వ్యాఖ్యలను జైరాం ఖండించారు. ఐదారేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. (వందేళ్లయినా పోలవరం పూర్తికాదని బలరాం అన్నారు) ప్రజల కోసమే పోలవరం ప్రాజెక్ట్‌ను నిర్మాణం జరుగుతోందన్నారు. ముంపు గ్రామాల ఆర్టినెన్స్ రాష్ట్రపతి వద్ద ఉన్నట్లు తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు చర్యలు తీసుకుంటామని, నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడతాయని జైరాం ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను ఎవరు వీడినా నష్టంలేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ వల్ల సీమాంధ్రకు 90 శాతం నిధులు చేకూరుతాయని, అందువల్ల సత్వర అభివృద్ధికి అవకాశం ఉంటుందని తెలిపారు.
పోలవరంపై కేంద్రం పూర్తి నిబద్ధతతో ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.16వేల కోట్లు అవసరమని, 90 శాతం నిధులను కేంద్రం ఇస్తుందన్నారు. నిర్వాసితులకు ఇల్లుకు ఇల్లు, భూమికి భూమి ఇస్తామన్నారు. కాగా జైరాం జిల్లా పర్యటనకు కాంగ్రెస్ నేతలు దూరంగా ఉన్నారు.
ఎప్పటికైనా కాంగ్రెసులోకే...
పార్టీని వీడుతున్న వారు ఎప్పటికైనా కాంగ్రెసు పార్టీలో కలవాల్సిందేనని జైరామ్ రమేష్ రాజమండ్రిలో అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ వల్లకాటిలో కలుస్తుందన్నారు. పోలవరం నిర్మించి తీరుతామన్నారు. జగన్, చంద్రబాబు, కిరణ్ కాంగ్రెసు పిల్లలే అన్నారు.












Click it and Unblock the Notifications