వైయస్ ఆత్మకు క్షోభ: జగన్‌పై జైరాం, డిగ్గీకి పెళ్లా: బాబు
కడప/ విజనగరం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి కాంగ్రెసు సీనియర్ నేత, కేంద్ర మంత్రి జైరాం రమేష్ విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పెడుతున్న డబ్బును బట్టి చూస్తే జగన్ వద్ద గొల్కొండలాంటి ధనాగారం ఉందనే విషయం స్పష్టమవుతోందని ఆయన అన్నారు.
బెయిల్‌పై బయట తిరుగుతూ ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, పావలా వడ్డీ, రుణమాఫీ పథకాలన్నీ తనవిగా చెప్పుకోవడం సిగ్గు చేటని ఆయన శుక్రవారంనాడు కడపలో మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మ క్షోభించే విధంగా జగన్ దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని జైరాం రమేష్ అన్నారు.

జగన్‌కు చెందిన అవినీతి సాక్షికి సాక్షి అని తప్పు పేరు పెట్టారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సాక్షి పుట్టుక, పెరుగుదల అంతా అవినీతేనని ఆయన అన్నారు. బుద్ధి లేకుండా సాక్షి అవినీతి వార్తలు రాస్తోందని అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. వైయస్సార్ కాంగ్రెసు సైకో పార్టీ అని, డబ్బు ఎక్కడిదంటే ఎదురు దాడి చేస్తోందని ఆయన అన్నారు.
రైతు రుణాల మాఫీ చేస్తామంటే జగన్ వద్దంటున్నారని, జగన్ రైతు వ్యతిరేకి అని ఆయన అన్నారు. కాంగ్రెసు నేత దిగ్విజయ్ సింగ్‌కు సిగ్గు లేదని, ఈ వయసులో పెళ్లి కావాలా అని చంద్రబాబు అన్నారు రాష్ట్ర విభజనపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆయన విమర్శించారు. సోనియా ఆటలు ఇటలీలో సాగుతాయి గానీ ఇక్కడ కాదని ఆయన అన్నారు.
సోనియా అండతో బొత్స సత్యనారాయణ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ బొత్స ఉంటాడని ఆయన అన్నారు. చీపురుపల్లిలో బొత్సకు డిపాజిట్ కూడా దక్కనీయవద్దని ఆయన కోరారు. సీమాధ్రను స్వర్ణాంధ్రగా మార్చేందుకు మోడీ సహకరిస్తామని చెప్పినట్లు చంద్రబాబు తెలిపారు.












Click it and Unblock the Notifications