ఏపీకి అన్యాయం వాస్తవం: జైట్లీ, వైసీపీ నిలదీత, గొంతు కలిపిన టిడిపి
న్యూఢిల్లీ/విజయవాడ: ఏపీకి అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని, ఏపీ సీఎం చంద్రబాబుతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం నాడు లోకసభలో ప్రకటించారు. త్వరలో హోదాకు పరిష్కారం లభిస్తుందన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా పైన వైసిపి ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి లోకసభలో కేంద్రాన్ని నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని విభజన సమయంలో డిమాండ్ చేసిన వారే ఇప్పుడు, అది సంజీవిని కాదని చెబుతున్నారని మేకపాటి ఆవేదన వ్యక్తం చేశారు.
విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు హోదా ఇవ్వాలన్నారు. మేకపాటితో పాటు పలువురు ఎంపీలు గళం కలిపారు. దీనిపై జైట్లీ స్పందిస్తూ... త్వరలో హోదా విషయంలో పరిష్కారం చూపిస్తామన్నారు. హోదా అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.

విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్టు జైట్లీ వెల్లడించారు. ఏపీ ప్రభుత్వంతో చర్చలు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. కొంత సంయమనాన్ని పాటించాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాలని మేకపాటి డిమాండ్ చేశారు.
టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే రాష్ట్రానికి నిధులు రావని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ కావాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకుముందు వైసిపి ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ప్లకార్డులతో నిరసన తెలిపారు.












Click it and Unblock the Notifications