
వాళ్లు తలుచుకుంటే ''నేనే రాజు - నేనే మంత్రి'': పవన్ కల్యాణ్
రాజకీయాల్లో రోజురోజుకు చురుకవుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికార ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని ప్రకటించారు. ''కౌలు రైతుల భరోసా యాత్ర'' సందర్భంగా ఆయన గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.

తూర్పుగోదావరి జిల్లా వాసులు తలుచుకుంటే చాలు..
''తూర్పుగోదావరి జిల్లా వాసులు తలుచుకుంటే తాను ముఖ్యమంత్రి అవగలుగుతానని'' జనసేనాని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అత్యంత చైతన్యవంతమైన జిల్లాల్లో తూర్పుగోదావరి ఒకటని, ఈ జిల్లా వాసులు ఎటువైపు మొగ్గు చూపితే మిగతా రాష్ట్రం అటువైపే మొగ్గు చూపుతుందన్నారు. అందుకే తాను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వాసులకు ప్రత్యేకంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. 14 సంవత్సరాల నుంచి తాను ఏం మాట్లాడుతున్నదీ, ప్రజలతో ఎలా మమేకమవుతోంది అన్న విషయానికి సంబంధించినవి ఇంటర్నెట్‌లో లభిస్తాయన్నారు.

వీడియోలు చూసి తన నిబద్ధత తెలుసుకోండి
''ఆ వీడియోలు చూసి తాను ఏం మాట్లాడింది.. తన నిబద్దత ఏంటి? అర్థం చేసుకోవాలని కోరారు. తాను సరిగానే వ్యవహరిస్తున్నాను.. తాను చేసేది సరైందేనని మీకు అనిపిస్తే తనకు అండగా నిలవాలని'' కోరారు. ''తన మాటల్లో నిజాయితీ ఉందని తూర్పుగోదావరి వాసులు గుర్తిస్తే తాను ముఖ్యమంత్రి అవుతానని'' పవన్ కల్యాణ్ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.

సొంత సొమ్ము నుంచే పరిహారం
''కౌలు రైతుల భరోసా యాత్ర'' పేరిట రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న మూడువేల మంది కౌలు రైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయాన్ని పవన్ కల్యాణ్ అందజేస్తున్నారు. గతంలో యాత్రలు చేసిన నేతలంతా బాధితులకు పరిహారాన్ని అందజేసినప్పటికీ అది ప్రభుత్వ సొమ్ము లేదంటే.. విరాళాలద్వారా పోగుచేసిన సొమ్మవుతోంది. తమ సొంత ఆదాయం నుంచి ఇంత భారీగా ఖర్చుపెట్టినవారు తక్కువ. కానీ సినిమాలద్వారా తనకు లభించే పారితోషికం మొత్తం కౌలు రైతు కుటుంబాలకు అందజేస్తున్న పవన్‌కల్యాణ్‌పై రాజకీయ వర్గాల నుంచి, సినీ వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.