Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..!
ఏపీలో రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో జట్టుకట్టి అధికారం సాధించుకున్నామన్న సంతృప్తి జనసేన (Janasena)లో లేకుండా పోతోంది. దానికి కారణం టీడీపీ జనసేనను ద్వితీయ శ్రేణి పార్టీగా పరిగణిస్తుండటమే అన్న ప్రచారం ఉంది. ఈ రెండేళ్లలో ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులతో మొదలుపెట్టి పలు విషయాల్లో టీడీపీ తమను పట్టించుకోవడం లేదన్న భావన స్వయంగా జనసేన ఎమ్మెల్యేల్లోనే పెరుగుతోంది. ఇది ఇవాళ మరోసారి బయటపడింది.
మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఇవాళ జరిగిన పార్టీ శాసనసభాపక్ష భేటీలో అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొన్నారు. ఈ భేటీలో వీరి మధ్య పలు కీలక అంశాలు, తాజా రాజకీయ పరిణామాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఇతర అంశాల్లో జనసేన అసంతృప్తిగా ఉందని ఎమ్మెల్యేలు భేటీ అనంతరం వెల్లడించారు.

టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో జనసేన నేతలకు న్యాయం జరగడం లేదని, ఇదే విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్యేలు తెలిపారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీకి ప్రాధాన్యమిస్తున్నామని, అలాగే తమకు కూడా అదే గౌరవం దక్కాలని కోరుకుంటున్నామని జనసేన ఎమ్మెల్యేలు ఇవాళ పవన్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ అలా జరగడం లేదని తెలిపారు. రాష్ట్ర స్ధాయిలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సహకరిస్తున్నా.. కింది స్థాయిలో మాత్రం అలా జరగడం లేదని, త్వరలో సమన్వయ సమావేశంలో చర్చిస్తామని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు.












Click it and Unblock the Notifications