బాబుపై వ్యాఖ్యలు: కుండ బద్దలు కొట్టడమే జెసి తత్వం!

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన జెసి దివాకర్ రెడ్డిని చంద్రబాబు నాయుడు తన తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన జెసి దివాకర్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడానికి సుముఖత వ్యక్తం చేయడం పట్ల ఎంత ఆశ్చర్యం వ్యక్తమైందో, తెలుగుదేశం పార్టీలో చేరడానికి జెసి ముందుకు రావడం కూడా అంతే ఆశ్చకర్యమైన సంఘటన అయింది. అయితే, జెసి దివాకర్ రెడ్డికి మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెసుకు పుట్టగతులుండవని గుర్తించిన జెసి దివాకర్ రెడ్డికి ప్రత్యామ్నాయం చూసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

జెసి దివాకర్ రెడ్డి కాంగ్రెసు నుంచి బయటకు రావాలనుకుంటే ముందున్న ప్రత్యామ్నాయాలు చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ, వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ. జగన్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి జెసి దివాకర్ రెడ్డి సమకాలికులు. రాజకీయాల్లో ఒకేసారి ఎదిగినవారు. వైయస్ రాజశేఖఱ రెడ్డి ప్రభుత్వ హయాంలో తీవ్రమైన అసంతృప్తితోనే జెసి దివాకర్ రెడ్డి కాంగ్రెసులో కొనసాగారు. వైయస్ జగన్ కింద నాయకుడిగా పనిచేయడం జెసి దివాకర్ రెడ్డికి సరిపడని విషయం. అంతేకాకుండా జగన్ వైఖరిపై పలుమార్లు ఆయన కుండబద్దలు కొట్టారు. అప్పుడు తెలుగుదేశం పార్టీయే ఆయనకు ప్రత్యామ్నాయంగా కనిపించింది.

జెసి దివాకర్ రెడ్డిని చంద్రబాబును చేర్చుకోవడానికి కూడా కారణం లేకపోలేదు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధిస్తుందనే అంచనాలు సాగుతూ వచ్చాయి. ఆ స్థితిలో తన పార్టీని గెలిపించుకోవడానికి చంద్రబాబు అన్ని రకాల ప్రయత్నాలు సాగించారు. వ్యూహాలు, ఎత్తుగడదల నుంచి అన్ని రకాలుగా ఆయన ప్రయత్నాలు సాగించారు. ఇందులో భాగంగానే జెసి దివాకర్ రెడ్డిని, ఆయన సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డిని చేర్చుకున్నారు. వారిద్దరు చేరితే ఓ అసెంబ్లీ సీటు (తాడిపత్రి), ఓ పార్లమెంటు సీటు (అనంతపురం) గెలుచుకోవడం ఖాయంగా కనిపించింది. ఎంతకు అంతే మంచిదనే ఉద్దేశంతో చంద్రబాబు వారిద్దరినీ పార్టీలో చేర్చుకున్నారు.

పార్టీకి ఏళ్ల తరబడిగా కట్టుబడి పనిచేసిన పరిటాల కుటుంబాన్ని కాదని ఆయన వారిద్దరినీ చేర్చుకున్నారు. పరిటాల సునీతకు అన్ని విధాలుగా నచ్చజెప్పి జెసి దివాకర్ రెడ్డిని చంద్రబాబు పార్టీలో చేర్చుకున్నారు. పరిటాల కుటుంబానికి, జెసి కుటుంబానికి అనంతపురం జిల్లాలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఆ స్థితిలో బద్ధ శత్రువులు కూడా ఒక గూటిలో ఇమిడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు జెసి దివాకర్ రెడ్డి అంగీకరించడమే కాకుండా పరిటాల సునీత కూడా వెనక్కి తగ్గారు. మొత్తం మీద జెసి దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు.

JC Diwakar Reddy don't care attitude in politics

నిజానికి, జెసి దివాకర్ రెడ్డి్ది ఏకవ్యక్తి నాయకత్వంలోని వ్యవస్థలో ఇమిడే వ్యక్తిత్వం కాదు. ఆయన ఏదైనా సరే, కుండబద్దలు కొట్టినట్లే వ్యవహరిస్తారు. కాంగ్రెసు పార్టీ కాబట్టి, ఆ పార్టీలో ప్రజాస్వామ్యం మోతాదుకు మించి ఉంటుంది కాబట్టి అందులో చాలా కాలం ఉండగలిగారు. అటువంటి జెసి దివాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పరిమితుల్లో ఇమడగలరా అనేది మొదటి నుంచీ సందేహంగానే ఉంటూ వచ్చింది. ప్రస్తుతం ఆయన చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు కూడా ఆ రాజకీయ వ్యక్తిత్వ లక్షణంలో భాగంగానే వచ్చాయి. తనకు నచ్చని విషయంపై ముఖం మీద చెప్పేడయం ఆయనకు అలవాటు. దాని పర్యవసానాల గురించి ఆలోచించి వెనక్కు తగ్గడం ఆయన వ్యక్తిత్వం కాదు. చంద్రబాబు చుట్టూ వెధవలున్నారని గురువారంనాడు వ్యాఖ్యానించి జెసి దివాకర్ రెడ్డి శుక్రవారంనాడు చంద్రబాబును కలిశారు. చంద్రబాబును కలిసిన తర్వాత కూడా ఆయన తన మాటల్లో తప్పేమీ లేదని సమర్థించుకున్నారు. అంటే, ఆయన వ్యక్తిత్వం ఏమిటో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

తెలుగుదేశం పార్టీలో చేరి, అనంతపురం నుంచి లోకసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత కూడా ఆయన నేరుగా చంద్రబాబుపై కాకుండా రాజధాని విషయంలో వ్యంగ్యంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. జెసి దివాకర్ రెడ్డికి వ్యంగ్యం అలవోకగా అబ్బిన విషయం. చాలా తీవ్రమైన విషయాలను కూడా అతి మామూలు పద్ధతిలో వ్యాఖ్యానించడం ఆయన శైలి. అదో పెద్ద విషయం కాదన్నట్లే మాట్లాడుతారు గానీ ఆ మాటలు తీవ్ర దుమారానికి దారి తీస్తాయి. అలా చంద్రబాబుపై గతంలో కూడా వ్యాఖ్యానించారు.

రుణమాఫీపై ఇలా...

రైతు రుణ మాఫీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి తప్పుపట్టారు. కొన్ని సమస్యలను చంద్రబాబే కొని తెచ్చుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఉన్నన్ని కష్టాలు మరెవరికీ లేవని ఆయన అభిప్రాయపడ్డారు. రుణమాఫీ చేసిన తర్వాతే పింఛన్లు పెంచి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. లక్ష రూపాయల రుణాన్ని మాఫీ చేస్తే చాలునని రైతులు ఆశిస్తున్నట్లు తెలిపారు. రుణాల కోసం ప్రస్తుతం ఏ బ్యాంకు అధికారిపై కూడా ఒత్తిడి చేయలేదని ఆయన స్పష్టం చేశారు. రుణాలు ఎప్పుడు మాఫీ చేస్తారనేది రైతులకు అవసరం లేదని జెసి అన్నారు.

వెంకయ్య నాయుడిపై ఇలా..

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అనంతపురంలో ఏర్పాటు కాదని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడి ఆశీస్సులతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు.

జగన్‌పై ఇలా.. (వైయస్ జగన్‌పై ఆయన మరీ తీవ్రమైన వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారు.. మచ్చుకు కొన్ని మాత్రమే)

జగన్‌కు ఇంకా మీసాలే మొలవలేదని జెసి ఎద్దేవా చేశారు. మీసాలు అంటే తన అర్థం.. పాలన దక్షత మీసాలు అన్నారు. అతని తండ్రి, తాతల దగ్గర సిగరేట్ తాగుతూ తాము మాటామంతి చెప్పుకునే వారమన్నారు. ప్రస్తుతం అతని వద్ద చేతులు కట్టుకొని సార్ అనలేకపోయానన్నారు. జగన్ అత్యాశకు హద్దే లేదన్నారు. జగన్‌ను నమ్మితే సన్యాసుల్లో కలిపేస్తారన్నారు.

చిరంజీవిపై ఇలా..

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి పైన మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి అనంతపురంలో నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో డబ్బులు తీసుకొని టిక్కెట్లు ఇచ్చే సంస్కృతి చిరంజీవి తోనే ప్రారంభమైందని ఆరోపించారు.

పవన్ కళ్యాణ్‌పై ఇలా..

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉద్వేగభరితంగా ఉన్నారని మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి అన్నారు. సినిమా గ్లామర్‌తో ఓట్లు రాబట్టుకోవడం ఒక్క స్వర్గీయ నందమూరి తారక రామారావుకే చెల్లిందన్నారు. ఇప్పడు సినిమా గ్లామర్‌ను చూసి ఓట్లు వేసే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు మరే హీరో అలా ఓట్లు రాబట్టుకోలేకపోయారన్నారు. పవన్ ఉద్వేగభరితంగా ఉన్నారని చెప్పారు.
కాంగ్రెసులో ఉంటూనే సోనియాపై ఇలా..

పిచ్చమ్మ చేతిలో రాయి ఉందని, ఆమె ఎటువైపు విసిరితే అటే రాజధాని ఏర్పడుతుందని జెసి వ్యాఖ్యానించారు. మాచర్లను రాజధాని చేస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఏ మూల నుండి అయినా నాలుగు గంటలలో రాజధానికి చేరుకోవచ్చునని చెప్పారు. రాజధాని కోసం పోరాడటమంటే బుద్ధిలేని చర్య అవుతుందన్నారు. పిచ్చమ్మ ఎటు విసిరితే అటే రాజధాని అవుతుందన్నారు. ఇంకోసారి దేనికైనా పోరాటం చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

పిచ్చి పట్టిందని సోనియాపై..

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోనియా గాంధీకి పిచ్చి పట్టిందని ఆరోపించారు. అధికారం ఇచ్చి ఆమె చేతిలో రాయి పెట్టామని, ఇప్పుడు ఆ రాయి ఎవరిపై పడినా బాధపడాల్సిందే తప్ప ఏం చేయలేమని అన్నారు. విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో తీవ్ర ఉద్యమం చేసి కోట్ల రూపాయలు నష్టపోయినా, రాజకీయ నాయకులు, ప్రజలు ఎంత బాధపడినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని జెసి దివాకర్ రెడ్డి ఆరోపించారు. ఇది గుడ్డి, చెవిటి ప్రభుత్వమని ధ్వజమెత్తారు. సోనియా గాంధీ తమ అధినేత కావడం తమ కర్మ అని ఆయన అన్నారు. వారు ఏది తల్చుకుంటే అది చేసేస్తారని అన్నారు.

కొసరు: కాంగ్రెసు పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబుపై, తెలుగుదేశం పార్టీపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. రాజకీయ నాయకులు అటువంటివాటిని మరిచిపోయి, తాము విమర్శించిన పార్టీలోనే చేరడం పెద్ద విషయమేమీ కాకపోయినప్పటికీ, సాధారణంగా జెసి దివాకర్ రెడ్డి లక్షణం అది కాదు. కానీ, రాజకీయ ప్రత్నాయం లేకనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+