ఫ్యామిలీలో ఒక్కరినే ఎలా ఎంచుకోగలం: తెలంగాణపై జెపి
హైదరాబాద్: విభజనపై లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు, కూకట్‌పల్లి శాసన సభ్యుడు జయప్రకాశ్ నారాయణ సోమవారం ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. అపార ప్రతిష్ఠ, వైభవాలతో విరాజిల్లే మన తెలుగు కుటుంబంలోని అన్నదమ్ముల్లో ఒకరిని కాదని, మరొకరిని ఎంచుకోవాల్సిన నిర్బంధం తనకెందుకని, ఈవేళ ఒక ప్రాంతం, రేపు మరో ప్రాంతం దహించుకుపోవటం ఎందుకని, ఇరు ప్రాంతాల గుండె ఘోషలూ తనకు వినిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది ఒకరు గెలిస్తే మరొకరు ఓడిపోవాలనే ఆట కాదని, తెలుగు కుటుంబంలో ఒకరు విజేతలుగా, మరొకరు పరాజితులుగా ఎందుకు ఉండాలన్నారు. తెలుగు వారి మధ్య సామరస్య పరిష్కారం వచ్చే అవకాశాలను తన స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఎందుకు కాలరాస్తోందని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన అంశం, కేంద్రం వ్యవహారశైలి, రాష్ట్రంలో పరిస్థితుల నేపథ్యంలో ఆయన లేఖ రాశారు. యావత్ దేశాన్ని జైలుగా మార్చి, స్వేచ్ఛకు సంకెళ్లు వేసి, రాష్ట్రాల రాజ్యాంగబద్ధ హక్కులను యధేచ్ఛగా కాలరాసిన ఎమర్జెన్సీ రోజులను కాంగ్రెస్ వ్యవహార శైలి గుర్తు చేస్తోందన్నారు.

దేశ ఆర్థిక, సమాఖ్య వ్యవస్థలతోపాటు ప్రజాస్వామ్యాన్ని కూలదోసేలా వ్యవహరించిన ఏకైక పార్టీగా చరిత్రలో కాంగ్రెస్ మిగిలిపోతోందని ధ్వజమెత్తారు. ఒక రాష్ట్రంపై ఇలా ఎప్పుడూ కేంద్రం నియంతృత్వ ధోరణితో వ్యవహరించలేదన్నారు. విభజన అంశంపై చట్టసభలో సమగ్రంగా చర్చించాలని అనేకసార్లు అన్ని పార్టీలనూ అభ్యర్థించానని, ఎవరూ వినిపించుకోలేదని, ఒక్క రక్తపు బొట్టు చిందకుండా జాతి నిర్మాతలు దేశం మొత్తాన్ని ఏకం చేశారన్నారు.
తెలంగాణ, సీమాంధ్ర భాగస్వాముల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు ససేమిరా అంటూ ద్వేష రాజకీయాలు, ఎన్నికల క్రీడలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం తగలబడుతుంటే చోద్యం చూస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ది స్వార్థ, వికృత రాజకీయమన్నారు. దానిని ఇతర పార్టీలు అనుసరించడం వల్లే ఇదో సంక్షోభంగా మారిందన్నారు. దశాబ్దాల కిందట వినీ వినపడనట్లున్న గొంతుక ఇప్పుడు బలమైన వాదంగా మారిందన్నారు. దానిని వికృత రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నా తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఆ గొంతు ఓటరు తీర్పు రూపంలో వెలువడుతూనే ఉందన్నారు.
రెండోగళం ఆక్రోశం, తీవ్ర భయాందోళనతో నిండి ఉందని, రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రజల కన్నీటి చారికల ముఖాలకు, రక్తమోడుతున్న హృదయాలకు తాను ప్రత్యక్ష సాక్షినని, ఇక్కడ కూడా వికృత రాజకీయ క్రీడలకు కొదవేమీ లేదన్నారు. భావోద్వేగం కూడా స్వచ్ఛమైనదని, దానిని సముచితంగా గుర్తించాలని కానీ, ఇరు ప్రాంతాలను సమన్వయపరిచే సత్తా లేదని కాంగ్రెస్ చేతులెత్తేసిందని మండిపడ్డారు. కాంగ్రెసుకు దేశాన్ని పాలించే నైతిక హక్కు లేదని మండిపడ్డారు.
కాంగ్రెస్ తీరు దేశ సమైక్యతకు హానికరంగా పరిణమించవచ్చు కానీ, భావోద్వేగాలతో ఒకరినొకరు కించపరచుకోవద్దన్నారు. ఇద్దరి ఆకాంక్షలను గౌరవించాలన్నారు. కాంగ్రెసు పార్టీ వికృత రాజకీయమని, ఆ పార్టీ స్వార్థమే విభజన సంక్షోభానికి కారణమన్నారు. ఈ నిర్లక్ష్యం దేశ సమైక్యతకే హానికరంగా మారవచ్చునని, రాష్ట్రంలో సామరస్య పరిష్కారం సాధ్యమే అన్నారు.












Click it and Unblock the Notifications