సర్వే: వివరాలిచ్చిన ఎన్టీఆర్, చంద్రబాబు ఇంటికీ...
హైదరాబాద్: నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ మంగళవారం సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లోని తన నివాసం ఎన్యుమరేటర్లకు ఆయన వివరాలు అందించారు. తన కుమారుడి పేరును అభిరామ్‌గా ఆయన నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఇంటికి కూడా ఎన్యుమరేటర్లు వెళ్లి వివరాలు సేకరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఇంటికి కూడా ఎన్యుమరేటర్లు చేరుకున్నారు. సమగ్ర కుటుంబ సర్వేకు నేతృత్వం వహిస్తున్న మున్సిపల్ శాఖ ఉన్నతాధికారి సోమేష్ కుమార్ తన కుటుంబ వివరాలను ఎన్యుమరేటర్లకు చెప్పారు.

కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని సంజీవయ్యనగర్‌లో సమగ్ర సర్వేకు వచ్చిన సిబ్బంది కాలనీ వాసులు అడ్డుకున్నారు. సర్వే ఫాంలో అప్పుల వివరాలు ఎందుకు లేదంటూ స్థానికులు సిబ్బందిని నిలదీశారు. ప్రజల ఇబ్బందులను పట్టించుకోని సర్వేలు ఎందుకోసమని స్థానికులు ప్రశ్నించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు స్థానికులకు నచ్చజెప్పడంతో వారు వెనక్కి తగ్గారు.
తెలంగాణ ప్రభత్వుం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై జిల్లాలో గందరగోళ పరిస్థితి నెలకొంది. భూమి యజమానితో పాటు, కబ్జాలో ఉన్న వారి పేరు కూడా నమోదు చేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై అధికారులను సంప్రదించగా ఇది కేవలం వ్యక్తిగత వివరాల కోసం చేస్తున్న సర్వే అని తెలిపారు.












Click it and Unblock the Notifications