ఏపీకి శుభవార్త వినిపించిన బంగాళాఖాతం
నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించినప్పటికీ అనుకున్న స్థాయిలో జూన్ నెల వర్షపాతం నమోదవలేదు. చాలా ప్రాంతాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. వాతావరణం వేసవికాలంలా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి తరుణంలో రాష్ట్రానికి వాతావరణ శాఖ శుభవార్త వినిపించింది. గుజరాత్-కర్ణాటక తీరం వెంబడి విస్తరించిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తా జిల్లాలతోపాటు రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
బలమైన ఈదురు గాలులు
దీని ప్రభావంతో ఏలూరు, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గంటకు 30 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, పిడుగుల పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులు పడటంతోపాటు తేలికపాటి వానలు పడతాయి. ఈరోజు రాత్రికి తిరుపతిలో భారీ వర్షాలకు అవకాశం ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.
తెలంగాణలో కూడా..
తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. రేపు (ఆదివారం) నాగర్‌కర్నూల్, వనపర్తి, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆది, సోమవారాలు రెండురోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. ఎనిమిదో తేదీ సోమవారం మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, ములుగు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications