‘ఫ్యామిలీ ఫంక్షన్’లా చేశారు: బాబుపై నెహ్రూ ఫైర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపి రాజధాని భూమిపూజను 'ఫ్యామిలీ ఫంక్షన్' గా మార్చేశారని ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయిన తనకు భూమిపూజ ఆహ్వానం రాలేదని మండిపడ్డారు.
ఆ కార్యక్రమానికి ప్రతిపక్ష నాయకుడిని కూడా సిఎం కానీ, సీఎస్ కానీ ఆహ్వానించలేదని, దీన్ని బట్టి చంద్రబాబుది నీచ సంస్కృతి ఏంటో తెలుస్తుందన్నారు. శుక్రవారం సాయంత్రం చంద్రబాబు నాయుడు భూమిపూజ కార్యక్రమానికి అటెండర్‌తో కార్డు పంపించి చేతులు దులుపుకున్నారని అన్నారు.

ఈ విషయంపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు కూడా ఇస్తామని జ్యోతుల అన్నారు. సమైక్య ఉద్యమకారుల్ని కూడా భూమి పూజకు ఆహ్వానించకపోవడం దారుణమని జ్యోతుల మండిపడ్డారు. బలం లేని చోట్ల చంద్రబాబు ఎమ్మెల్సీ అభ్యర్థులను పోటీలో ఎందుకు నిలుపుతున్నట్లో సమాధానం చెప్పాలని నెహ్రూ డిమాండ్ చేశారు.
ఆ ఎన్నికల్లో ఎంతమంది రేవంత్ రెడ్డిలను వదిలి ఓటర్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారో చంద్రబాబు వెల్లడించాలన్నారు. రెండు స్థానాలే ఉన్నా విశాఖ, కృష్ణా జిల్లాల్లో వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇప్పించటంపై చంద్రబాబు దురుద్దేశం మరోసారి బయట పడిందని జ్యోతుల నెహ్రూ ఆరోపించారు.
దీనిపై ఇప్పటికే కోర్టును కూడా ఆశ్రయించామని ఆయన అన్నారు. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డి విషయంలో చంద్రబాబు నాయుడు నీతిమంతంగా మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉందని జ్యోతుల నెహ్రూ అన్నారు.












Click it and Unblock the Notifications