రెండు వారాల్లో రూ.4వేల కోట్లిస్తా: కేఏ పాల్
విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ తెలుగు ప్రజల మనోభావాలపై ఆధారపడి విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ఏర్పాటైందని, దీన్ని అందరం కలిసి కాపాడుకోవాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు కర్మాగారం కొనుగోలుకు రూ.42 వేల కోట్లకు బిడ్ వేయనున్నట్లు తెలిపారు. తన తండ్రి బర్నబాస్‌ను కలిసేందుకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వచ్చారు.
ఆర్డీవో కార్యాలయం వద్ద స్థానికులను పలకరించి వారితో మాట్లాడిన కేఏ పాల్ బిడ్ వేసేందుకు కొన్ని లేఖలు అవసరమని, వాటినివ్వాలని అడుగుతున్నానన్నారు. అవి తనకిస్తే రెండు వారాల్లోనే రూ.4వేల కోట్లు ఇస్తానని, విశాఖపట్నం ఉక్కు కర్మాగారం విలువ రూ.3.5 లక్షల కోట్లుకాగా దాన్ని రూ.3,500 కోట్లకు అమ్మేద్దామని చూస్తున్నారని ఆరోపించారు.

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని, దాన్ని అందరం కలిసి కాపాడుకోవాలని, తెలుగుదేశం, వైసీపీ, సీపీఐ నాయకులను కలిసేందుకు విశాఖపట్నం వచ్చానన్నారు. తెలంగాణ ప్రభుత్వం బిడ్ వేస్తానంటోందని, ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుగా కేసీఆర్ మాట తీరు ఉందని విమర్శించారు.
చంద్రబాబు రూ.5 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని జగన్‌కు అప్పగిస్తే.. ఈయన మరో రూ.4 లక్షల కోట్లు అప్పు చేశారని, తాము ముఖ్యమంత్రి అయితే అమరావతిలో ఆపేసిన భవనాలన్నింటినీ ఏడాదిలో పూర్తిచేస్తానన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, జనసేనాని పవన్ కల్యాణ్ తనతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేఏ పాల్ పేర్కొన్నారు.

విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరించడం తథ్యమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. దీనిపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆంధ్రులంతా నెలకు రూ.400 చొప్పున మూడునెలలపాటు ఇస్తే విశాఖ ఉక్కును ప్రయివేటు పరం కాకుండా అడ్డుకోవచ్చన్నారు. అదానీ కంపెనీకి విశాఖ ఉక్కును కట్టబెట్టేందుకే కేంద్రం ఇలా చేస్తోందంటూ సీపీఐ నాయకులు మోడీ సర్కార్ పై మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications