జనాల భుజాలపైకెక్కి టీడీపీపై మీసం మెలేసిన కదిరి సీఐ
సీఐ TDP మహిళలను సైతం అసభ్య పదజాలంతో దూషించడంతో ఒక్కసారిగా కదిరి పట్టణంలో ఉద్రిక్తతలు తలెత్తాయి.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్స సందర్భంగా.. ఆలయం చుట్టు పక్కల ఉన్న షాపులను తొలగించారు. అయితే ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారింది. ఉన్న పళంగా తమ దుకాణాలను తొలగిస్తే ఉపాధి కోల్పోతామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.

అండగా కందికుంట
తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇంఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ వారికి అండగా నిలిచారు. పూర్తిగా అడ్డం ఉన్న షాపులను మాత్రమే తొలగించాలని, మిగతావి వదిలేయాలని కోరారు. కానీ ఆలయ అధికారులు అందుకు ఒప్పుకోకపోవడంతో వాగ్వాదం జరిగింది. వాగ్వాదం జరగడంతో సీఐ మధు అక్కడికి చేరుకొని తెలుగుదేశం పార్టీ వర్గీయులను అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్, సీఐ మధు మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో టీడీపీ శ్రేణులు చెన్నై జాతీయ రహదారిపై ఆందోళనకు దిగాయి.

మహిళలపై సీఐ అసభ్య పదజాలం
సీఐ మహిళలను సైతం అసభ్య పదజాలంతో దూషించడంతో ఒక్కసారిగా కదిరి పట్టణంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. సీఐ మధు ఇంటి వద్ద తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ధర్నా చేపట్టింది. నియోజకవర్గ ఇన్ ఛార్జి కందికుంట వారికి మద్దతుగా అక్కడికి వెళ్లారు. అదే సమయంలో వైసీపీ నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. అదే సందర్భంలో కొందరు వ్యక్తులు సీఐ మధును భుజాలపైకి ఎత్తుకోగా.. ఆయన మీసం మెలేసిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు యూనిఫాంలో ఉన్న వ్యక్తి ఇలా చేయడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు.

ఎస్పీ పర్యటన
పోలీసులు, వైఎస్సార్సీపీ కార్యకర్తల దాడిలో తమ కార్యకర్తలు గాయపడ్డారని టీడీపీ నాయకులు వెల్లడించారు. కదిరి ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వారిని మాజీ మంత్రి పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఇతర నాయకులు పరామర్శించారు. కదిరి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలను మొహరించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ కదిరిలో పర్యటించనున్నారు. సీఐని సస్పెండ్ చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తమపై దాడిచేయాల్సిన సందర్భం లేదని, కానీ సీఐ అత్యుత్సాహంతో వ్యవహరించారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications