వైసీపీ ఎమ్మెల్యే అల్లుడి అనుమానాస్పద మృతి - తాడేపల్లిలో కలకలం..!!
వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు ఆత్మహత్యకు పాల్పడ్దారు. ప్రభుత్వ విప్, అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథరెడ్డి (36) ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. తాడేపల్లి మండలం కుంచనపల్లిలో ఆయన నివాసం ఉంటున్న అవంతి అపార్ట్‌మెంట్‌లో ఆయన ఉరేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో మంజునాధ రెడ్డి అనుమానాస్పద మృతి గా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ
మంజునాధ రెడ్డి చలనం లేకుండా ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యలు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. మంజునాథ రెడ్డి వ్యాపారాలు చేస్తున్నారు. ఆయన రెడ్డి అండ్ రెడ్డి అనే కంపెనీని నిర్వహిస్తున్నారని, అప్పుడప్పుడు కుంచనపల్లిలోని నివాసానికి వస్తుంటారని చెబుతున్నారు. ఈ ఫ్లాటుకు ఆయన వచ్చిన సమయంలో రెండు మూడు రోజులు ఉండి వెళ్తుంటారని స్థానికులు చెబుతున్నారు. మూడు రోజుల క్రితం వచ్చిన ఆయన ఇప్పుడు ఆత్మహత్యకు పాల్పడ్డారా ..లేక ఆయన మరణం వెనుక ఇతర కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.

బిల్లులు చేతికి అందక..ఒత్తిడితో
మంజునాధ రెడ్డి స్వగ్రామం అన్నమయ్య జిల్లా రామాపురం మండలం హసనాపురం పంచాయితీలోని పప్పిరెడ్డిగారి పల్లె. ఆయన తండ్రి మహేశ్వర్ రెడ్డి పీఎంఆర్ సంస్థ యజమాని. ఆయన సైతం వైసీపీ నేతగా ఉన్నారు. మంజునాథరెడ్డి మరణ వార్త విని వెంటనే ఆయన విజయవాడకు బయల్దేరారు. మంజునాథ రెడ్డి సతీమణి ప్రవంతి వైద్యురాలు. స్థానికులు చెబుతున్న సమచారం మేరకు మంజునాథ రెడ్డి సాయంత్రం ఫ్లాట్ లోకి వెళ్లారని..ఆ తరువాత అంబులెన్స్ వచ్చిందని చెప్పినట్లుగా కధనాలు వస్తున్నాయి.

పోలీసుల విచారణ
ఆయన గది లోపల మంచి పక్కన పడిపోయి ఉండటాన్ని స్థానికులు గమనించినట్లుగా చెబుతున్నారు. అయితే, కాంట్రాక్టర్ గా ఉన్న మంజునాథ రెడ్డి కాశ్మీర్ తో సహా ఇతర రాష్ట్రాల్లో చేసిన పనులకు సంబంధించి బిల్లులు రావాల్సి ఉందని..ఇదే సమయంలో బ్యాంకుల నుంచి ఫైనాన్స్ అందకపోవటంతో..తమ కుమారుడు తీవ్ర ఒత్తిడితో ఉన్నారని తండ్రి మహేశ్వర్ రెడ్డి చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు మంజునాథ రెడ్డి ఆత్మహత్య కు పాల్పడ్డారా..ఏ జరిగిందనేది పోలీసు విచారణలో వెల్లడికానుంది.












Click it and Unblock the Notifications