ఎవరి వ్యూహాలు వారివి: మోడీకి బాబు దూరమా? దగ్గరగా కేసీఆర్, జగన్
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దగ్గరవుతుండగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరం అవుతున్నట్లుగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఆ దిశలో వెళ్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో బీజేపీ-టీడీపీలు పొత్తు పెట్టుకున్నాయి. ఆ తర్వాత ఏపీలో చంద్రబాబు కేబినెట్లో బీజేపీకి, కేంద్రంలో మోడీ కేబినెట్లో టీడీపీకి అవకాశం వచ్చింది. అయితే, ఇటీవలి కాలంలో టీడీపీ, బీజేపీల మధ్య క్రమంగా దూరం పెరుగుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా నిర్ణయం పైన ఆలస్యం, కొత్త రాష్ట్రమైన ఏపీకి రూ.20వేల కోట్లు నిధులు ఇవ్వాలని కోరిన ఏపీకి కేంద్రం మొండిచేయి చూపిన నేపథ్యంలో ఈ అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు. కేంద్రంతో దోస్తీ చంద్రబాబుకే అవసరమని అంటున్నారు.
2019కల్లా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కీలకంగా ఉండాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ బలోపేతం కోసం పని చేస్తోంది.
ఇప్పటికే తెలంగాణలో బీజేపీకి సైకిల్ పార్టీతో కలిసి పని చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. ఏపీలోను కొందరు నేతలు అదే అభిప్రాయంతో ఉన్నారని తెలుస్తోంది. టీడీపీతో పొత్తు లేకుండా ఉంటే పార్టీ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడుతున్నారట.

ఇక, టీడీపీ కూడా బీజేపీ పైన ఏమాత్రం సంతృప్తితో లేదనే వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా, నిధుల విషయంలో కేంద్రం నుండి ఆశించిన సహకారం లేదని సీఎం చంద్రబాబు సహా పలువురు భావిస్తున్నారు. కేంద్రం నుండి ప్రస్తుతం ఆశించిన సహకారం లేదని బాబు, మంత్రులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు పైన చంద్రబాబు పునరాలోచనలో ఉన్నట్లు కొద్ది రోజుల క్రితం ఊహాగానాలు కూడా వినిపించాయి. మరోవైపు, టీడీపీతో పొత్తు పెట్టుకుంటే రెండు రాష్ట్రాల్లో ఉండాలి, లేకుంటే రెండు రాష్ట్రాల్లో ఉండకూడదు. ఇది బీజేపీ సమస్యగా ఉందని చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీ నేతలు అయితే టీడీపీతో కలిసి పని చేసేందుకు ఏమాత్రం సిద్ధంగా లేరని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఈ దోస్తీ ఎప్పుడైనా ముగిసిపోవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
మరోవైపు, కేసీఆర్ ఇటీవల బీజేపీకి దగ్గరవుతున్నారు. సోమవారం ఢిల్లీలో పర్యటించిన కేసీఆర్ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. కాకతీయ మిషన్, వాటర్ గ్రిడ్ కోసం యాభై శాతం నిధులు ఇవ్వాలని కోరారు. మంగళవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయి విద్యుత్ విషయమై చర్చించనున్నారు.
గతంలో బీజేపీ - తెరాస ఉప్పునిప్పులా కనిపించాయి. అయితే, కొత్త రాష్ట్రం అవసరాల నేపథ్యంలో కేసీఆర్ కేంద్రంతో దోస్తీయే మంచిదని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన మోడీకి దగ్గరవుతున్నారని అంటున్నారు. ఇటీవలి కాలంలో తెరాస కేసీఆర్ వ్యాఖ్యలు చూసినా బీజేపీకి దగ్గరవుతున్నట్లుగా కనిపిస్తుంది.
దానికి తోడు, గత కొద్ది రోజులుగా.. మోడీ కేబినెట్లో తెరాస చేరుతుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఏప్రిల్ నెలలో ప్రధాని మోడీ తన కేబినెట్‌ను విస్తరించే అవకాశాలున్నాయి. ఇందులో తెరాసకు చోటు దక్కుతుందని చాలామంది భావిస్తున్నారు. కేకే, కవితలకు చోటు దక్కవచ్చునని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తిట్టిన నోటితోనే కేసీఆర్ ఇప్పుడు ప్రధాని మోడీని పొగుడుతున్నారంటున్నారు.
కేంద్రంపై టీడీపీ కొంత అసంతృప్తి, అదే సమయంలో కేసీఆర్ దగ్గరవుతున్నారని, ఇది చంద్రబాబుకు ఇబ్బంది పెట్టే అంశమేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తెలంగాణ మిగులు బడ్జెట్‌లో ఉంది. పైగా రాజధాని హైదరాబాద్ ఉంది. ఏపీలో రాజధాని లేదు. పైగా లోటు బడ్జెట్‌లో ఉంది. తెలంగాణ కంటే ఏపీకే ఎక్కువ ఆర్థిక సమస్యలు ఉన్నాయి. మోడీకి కేసీఆర్ దగ్గరవుతే అది చంద్రబాబుకు ఇబ్బంది అంటున్నారు.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా మోడీకి దగ్గరవుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో జగన్ ఏపీ సీఎం చంద్రబాబు పైన దుమ్మెత్తి పోశారు. వామపక్ష నేతలు మాట్లాడుతూ.. జగన్, కేసీఆర్, చంద్రబాబులు ప్రధాని మోడీ పైన ప్రశంసలు కురిపిస్తున్నారని, ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు కూడా చేశారు.












Click it and Unblock the Notifications