కెసిఆర్ జట్టులో సురేఖ, నాయని: స్పీకర్‌గా పోచారం?

హైదరాబాద్: తెలంగాణలో మంత్రి పదవులు ఆశిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు ఇబ్బడి ముబ్బడిగా ఉంది. మంత్రి పదవుల కోసం చాలా మంది ఇప్పడికే కాబోయే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును కలుసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం దళితుడిని చేస్తామనే విధాన నిర్ణయం నుంచి పార్టీ వెనక్కి వెళ్లిన నేపథ్యంలో మిగిలిన ప్రభుత్వ పదవుల్లో తమకు మంచి అవకాశాలు దక్కుతాయని ఎన్నికల్లో గెలిచిన పలువురు దళిత ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.

ముస్లిం మైనార్టీకి డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన మేరకు అందుకు ఎమ్మెల్సీ మహమూద్ అలీ పేరు బాగా ప్రచారంలో ఉంది. అయితే, మజ్లీస్ ప్రభుత్వంలో చేరితే ఆ పదవి అక్బరుద్దీన్‌కు దక్కవచ్చునని అంటున్నారు. దళితుడికి మరొక డిప్యూటీ సీఎం పదవి ఇస్తారనే అంచనాలూ పార్టీలో ఉన్నాయి. ఈమేరకు కరీంనగర్ జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ డిప్యూటీ సీఎం రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పంచాయతీరాజ్‌శాఖతో కూడిన డిప్యూటీ సీఎం పదవి ఈశ్వర్‌కు ఇస్తారని ఆయన అనుచరగణం భావిస్తోంది.

నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేరు తెలంగాణ అసెంబ్లీ తొలి స్పీకర్ పదవికి వినిపిస్తోంది. అయితే, ఆయన మంత్రి పదవి పట్లనే ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. నల్గొండ జిల్లా నుంచి మంత్రి పదవి ఖాయమని భావిస్తున్న జి.జగదీశ్‌రెడ్డి కూడా పంచాయతీరాజ్‌శాఖపై కన్నేసినట్లు తెలుస్తోంది.

KCR cabinet may include Konda surekha, nayani Narsimha reddy

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్షం మాజీ నేత ఈటెల రాజేందర్‌కు కీలకమైన హోం శాఖను అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది. లేకపోతే ఇటు అసెంబ్లీ, అటు శాసనమండలిలోనూ సభ్యుడు కానటువంటి సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డిని కేబినెట్‌లోకి తీసుకొని హోం శాఖ అప్పగిస్తారని అంటున్నారు. ఆయనను తొలుత మంత్రివర్గంలోకి తీసుకున్నాక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారని చెబుతున్నారు.

కేసీఆర్ కుటుంబ సభ్యులైన టి.హరీశ్‌రావు వరుసగా మూడోసారి, కెటిఆర్ వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వారికి మంత్రి పదవులు ఖాయమని అంటున్నారు. హరీశ్‌రావుకు అత్యంత ప్రాధాన్యం కలిగిన నీటిపారుదల, విద్యుత్ శాఖలను అప్పగించవచ్చని, ఐటీ అభివృద్ధి శాఖను లేదా విద్యాశాఖను అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది.

వరంగల్ జిల్లాలోని కొండా సురేఖకు మంత్రి పదవి ఖాయమని అంటున్నారు. గతంలో కెసిఆర్ అనేక సందర్భాల్లో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యేగా ఎన్నికైన టీజీఓ అధ్యక్షుడు వి.శ్రీనివాస్‌గౌడ్ తనకు మంత్రి పదవి దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కె.స్వామిగౌడ్ కూడా తనకు మంత్రి పదవి లభిస్తుందనే ఆశతో ఉన్నారు. స్వామిగౌడ్‌ను మంత్రి చేస్తానని కెసిఆర్ పలు సందర్భాల్లో అన్నారు.

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సైతం తనకు సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ దక్కుతుందని ఆశిస్తున్నారు. ఇక హైదరాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేలు టి.పద్మారావు, జలగం వెంకట్రావులకు కేబినెట్‌లో బెర్త్ ఖాయమంటున్నారు. ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, అజ్మీరా చందూలాల్, బాబూమోహన్‌లకు మంత్రి పదవులు ఖాయమనే ప్రచారమూ ఉంది.

బీఎస్పీ ఎమ్మెల్యేలు ఇద్దరూ పార్టీలో చేరితే, అందులో ఒకరైన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కూడా మంత్రి పదవి ఖాయమంటున్నారు.అయితే కెసిఆర్ తన మంత్రివర్గంలో తొలి విడత ఎంత మందికి చోటు ఇస్తారనే విషయంలో స్పష్టతలేదు. కెసిఆర్ తాను కాకుండా మరో 17 మందిని మంత్రులుగా చేర్చుకోవడానికి అనుమతి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+