కొండా సురేఖపై కెసిఆర్ ఆసక్తికరం, దుఃఖం వస్తుందని..
హైదరాబాద్: మాజీ మంత్రి కొండా సురేఖపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. తెరాస ఎల్పీ సమావేశమై కెసిఆర్‌ను నేతగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు.
కొండా సురేఖను పార్టీలో చేర్చుకోవటంపై టిజెఏసి సహా ఎందరో విమర్శించారని కానీ, తాము ఆమెకు అదికారం ఇవ్వలేదని, ప్రజల తీర్పుకే నిలబెట్టామని, గెలిపిస్తారా? తిరస్కరిస్తారా? అనేది ప్రజలకే వదిలేశామని, ప్రజలు గెలిపించటం వల్లనే సురేఖ ఎమ్మెల్యే అయ్యారని కెసిఆర్ వ్యాఖ్యానించారని సమాచారం.

కొండా సురేఖను తెలంగాణ ఐకాస తెలంగాణ ద్రోహి అని ప్రకటించడాన్ని తాను తప్పు పట్టాని, ఐకాస నేతలకు కూడా ఆ విషయాన్ని చెప్పానని కూడా ఆయన వ్యాఖ్యానించారట.
మరోవైపు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారులు, తెరాస నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగతం కాదని, ఓ సభ్యురాలిగా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మాట్లాడానే తప్ప, వ్యక్తిగతంగా ఎవరినీ నొప్పించాలని అనుకోలేదని, అప్పటి మాటలను ఎవరూ మనసులో పెట్టుకోవద్దని, కెసిఆర్ పెద్ద మనసుతో పార్టీలో చేర్చుకొని, ఎమ్మెల్యేగా గెలిపించారని, ఆయన అడుగుజాడల్లో తెలంగాణ పునర్మిర్మాణంలో ఒక కార్మికురాలిగా పని చేస్తానని కొండా సురేఖ అన్నారు.
కాగా, తెరాస ప్రభుత్వంలో దళిత సంక్షేమ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని, అందరు అనుమతిస్తే ఆ శాఖను తన దగ్గరే పెట్టుకొని నిర్వహించాలని ఉందని కెసిఆర్ కొత్తగా ఎంపికమైన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కోరారు. ఫండ్స్‌లేక కాదు.. దళితులకు మేలు చేయాలనే సంకల్పం లేకపోవటమే వారి వెనుకబాటుకు కారణమన్నారు. దళితుల జీవితాలను చూస్తే దుఃఖం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications