మాఫీ చేస్తాననలేదు: కెసిఆర్, 'నమస్తే..' తెస్తా: ఎర్రబెల్లి
హైదరాబాద్: తన మీద ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా డ్వాక్రా మహిళ రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇవ్వలేదని, ఇంకా తాను అబద్దాలు చెప్పడం నేర్చుకోలేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీలో అన్నారు. గవర్నర్ ప్రసంగం పైన చర్చ సాగుతోంది. ఈ సమయంలో ఎర్రబెల్లి, హరీష్ రావు, కెసిఆర్‌ల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. డ్వాక్రా మహిళల రుణాల పైన కెసిఆర్ వివరణ ఇచ్చారు.
తాము ఇచ్చిన హామీ మేరకు రైతులకు లక్ష రూణాలు మాఫీ చేస్తామని చెప్పారు. మేనిఫెస్టోలో హామీలను కచ్చితంగా నెరవేరుస్తామన్నారు. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదన్నారు. కొత్త రాష్ట్రంలో ఇంకా పూర్తిస్థాయి పరిపాలన ప్రారంభం కాలేదన్నారు. రాష్ట్రంలో కేవలం 70 మంది అధికారులతోనే ప్రభుత్వం నడుస్తోందన్నారు. తాము ముందు ముందు ఏం చేస్తామో.. ఎలా చేస్తామో.. ఓపికతో చూడండన్నారు.

అద్భుతమైన తెలంగాణను నిర్మించుకుందామన్నారు. తాము ఏది చెప్పినా బాధ్యతతో చెబుతామన్నారు. డ్వాక్రా మహిళల రుణాల పైన తాను అనని మాటలు అన్నట్లుగా చెప్పవద్దన్నారు. ఎర్రబెల్లి అమాయకంగా మాట్లాడితే తాము ఏం చేయలేమన్నారు. అసెంబ్లీలో పద్దతిగా మాట్లాడితే బాగుంటుందన్నారు.
డ్వాక్రా మహిళా రుణాలు మాఫీ చేస్తామని చెప్పలేదని, తాను అనని వాటిని అన్నట్లుగా చెప్పవద్దన్నారు. టిడిపి నేతలు ప్రజలను కన్ఫ్జూజ్ చేయవద్దన్నారు. తాను అడ్డగోలుగా చెప్పదల్చుకోలేదన్నారు. డ్వాక్రా రుణాల పైన వక్రీకరణ చేయవద్దన్నారు. ఇటీవల తమ పార్టీ దిమ్మెలు ఎవరు కూలగొట్టారో తమకు తెలుసునని చెప్పారు.
కెసిఆర్ వ్యాఖ్యలపై ఎర్రబెల్లి మాట్లాడుతూ... డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్నారని తాను అనలేదని, అర్థం చేసుకోవాలని, మాఫీ చేయమని అడుగుతున్నానని ఎర్రబెల్లి అన్నారు. మీరు ఎన్నో హామీలు ఇచ్చారని, అవసరమైతే నమస్తే తెలంగాణ పత్రికను పట్టుకొని వస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications