TDP Vs TRS: చంద్రబాబునాయుడి ప్రభుత్వాన్ని కూలదోయాలనుకున్న కేసీఆర్
చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని కేసీఆర్ ఎలా కూలదోయాలనుకున్నారో అనే వివరాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకప్పటి సహచరుడు, మాజీ మంత్రి, బీజేపీ నేత ఏ.చంద్రశేఖర్ తెలిపారు. తర్వాత ఈ విషయం చంద్రబాబునాయుడుకు తెలియడంతో కేసీఆర్ కుట్రకు తెరపడిందన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన ఒక సభలో చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తాను, కేసీఆర్ ఒకేసారి మంత్రులమయ్యామని చెప్పారు. 1999లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబునాయుడు కేసీఆర్ కి మంత్రి పదవి ఇవ్వలేదని, డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారన్నారు. దీంతో ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఉంటూనే చంద్రబాబునాయుడి ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నాలు ప్రారంభించారని వివరించారు.

ముందుగా ఎమ్మెల్యేల్లో చీలిక తెచ్చేందుకు ప్రయత్నించారని, కేసీఆర్, నేను, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తోపాటు మరికొందరం కలిశామన్నారు. దీనిపై నాలుగు నెలలపాటు చర్చలు తీవ్రంగా సాగాయని, చివరగా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి 60 మంది ఎమ్మెల్యేలు ఒకటయ్యారని, సంఖ్య సరిపోతుందని, గవర్నర్ ను కలుద్దామని కేసీఆర్ అన్నారని చంద్రశేఖర్ తెలిపారు. అయితే చివరగా 61వ ఎమ్మెల్యేగా జ్యోతుల నెహ్రూను సంప్రదించడంతో ఆయన చంద్రబాబుకు విషయాన్ని తెలియజేశారన్నారు.
కేసీఆర్ కు ఉన్నంత అధికార దాహం ఏ రాజకీయ నాయకుడికీ ఉండదని, ఉద్యమ సమయంలో తనను ముఖ్యమంత్రిని చేస్తానన్నారని, మధుసూదనాచారితోపాటు మరికొందరిని మంత్రులుగా చేస్తానని హామీ ఇచ్చారన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వకుండా ఇప్పుడు వారిని మోసం చేస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications